Indian Air Force: ఇండియన్ ఆర్మీ ఖలేజా ఏంటో తెలుసు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా ఏంటో తెలుసు.. ఇండియన్ నేవీ బలమేంటో తెలుసు. ఇవన్నీ ఒకే గొడుగు కిందకు వస్తే.. ఒకేసారి కలిసి పనిచేస్తే.. మన శత్రు దేశాలు తట్టుకోగలవా? ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఆపరేషన్స్‌ని కలిపే.. కొత్త థియేటర్ కమాండ్ స్ట్రాటజీని ఇండియా సిద్ధం చేస్తోంది. అసలు.. భారత భద్రతా దళాల విషయంలో.. పీఎం మోడీ ప్లాన్ ఏంటి?
శత్రు దేశాలకు అంతుచిక్కని పద్మవ్యూహం
ఇప్పటివరకు చూసిన భారత్ ఒక లెక్క.. ఇకపై చూడబోయే భారత్ మరో లెక్క! ఇది.. నయా ఇండియా. ఎప్పటికప్పుడు తన సైనిక వ్యూహాలకు పదును పెడుతూ.. శత్రు దేశాలకు అంతుచిక్కని పద్మవ్యూహంలా ఉండటమే ఇప్పుడు భారత్ అలవాటు చేసుకున్న తీరు! అవును.. ఇండియా ఇప్పుడు తన భద్రతా దళాల కార్యకలాపాలను.. ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకు.. థియేటర్ కమాండ్‌లని ఏర్పాటు చేసే దిశగా చురుగ్గా ముందుకు సాగుతోంది. దీనికి.. 2019లోనే బీజం పడింది. త్రివిధ దళాల మధ్య ఉన్న సమన్వయ అంతరాన్ని పూర్తిగా తొలగించేందుకు.. ఈ చొరవ తీసుకుంది భారత సర్కార్. ప్రధాని మోడీ తన 2019 పంద్రాగస్టు ప్రసంగంలో.. అవసరమైనప్పుడు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. అప్పుడే.. థియేటర్ కమాండ్‌లపై తొలిసారి చర్చ మొదలైంది. అదే ఏడాది.. త్రివిధ దళాల సమన్వయం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వనరుల్ని.. నిర్దిష్టమైన థియేటర్ కమాండ్‌లుగా మార్చడంతో పాటు ఒకే థియేటర్ కమాండ్ కింద మోహరించే ప్లాన్ ఇది. ప్రతి కమాండ్‌కి.. ఓ ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం కేటాయిస్తారు. ఆపరేషనల్ రోల్స్ కోసం.. మూడు సేనలని ఒకే చోట మోహరిస్తారు.
ఆపరేషన్ సింధూర్‌లో సమన్వయంతో త్రివిధ దళాలు
ట్రై-సర్వీస్ ఆర్గనైజేషన్స్, భవిష్యత్ థియేటర్ కమాండ్‌లు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిపై పూర్తి అధికారం ఇచ్చాయ్. పాకిస్థాన్‌తో ఇటీవలి సైనిక ఘర్షణల సమయంలోనూ.. త్రివిధ దళాలు సమన్వయం ముందుకు కదిలాయ్. అయితే.. ఇది కేవలం ఆపరేషన్ సింధూర్‌కు మాత్రమే పరిమితం కాలేదు. 2019 బాలా కోట్ ఎయిర్ స్ట్రైక్స్ ని కూడా ఈ థియేటర్ కమాండ్‌లకి ఓ ఎగ్జాంపుల్‌గా భావిస్తారు. అప్పుడు.. ఐఏఎస్ తన టార్గెట్‌ని ఎంతో కచ్చితత్వంతో ఛేదించింది. అయితే.. ఆ తర్వాత అరేబియా సముద్రంలో ఆర్మీ మొబిలైజేషన్, నేవీ మోహరింపు కూడా జరిగింది. ఆ తర్వాతి నుంచి.. త్రివిధ దళాలు ఒకే సమయంలో కదులుతున్నప్పటికీ.. ఒక్కటిగా ముందుకు సాగడం లేదు. ప్రత్యర్థిని దెబ్బకొట్టడంలో.. ఐక్యత ప్రదర్శించడం లేదు. ఈ గ్యాప్‌ని ఫిల్ చేసేందుకు.. కేంద్రం పెద్ద అడుగులు వేస్తోంది. థియేటర్ కమాండ్‌లను సృష్టించడానికి ముందే.. పరికరాలు, లాజిస్టిక్స్, సప్లై చైన్‌ని సెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అన్ని స్థాయిల్లో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య జాయింట్ యాక్షన్ ప్లాన్‌ని సెట్ చేసేందుకు.. మరిన్ని క్రాస్ పోస్టింగ్‌ల వంటి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌కు ఏడు కమాండ్‌లు నేవీకి మూడు కమాండ్‌లు
ప్రస్తుతం.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు ఏడు కమాండ్‌లు ఉన్నాయి. నేవీకి మూడు ఉన్నాయి. అదనంగా.. రెండు ట్రై-సర్వీస్ కమాండ్‌లు ఉన్నాయి. అండమాన్, నికోబార్ కమాండ్, భారతదేశ అణ్వాయుధ సామాగ్రిని నిర్వహించే.. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఉన్నాయి. కార్గిల్ వార్ తర్వాత.. ఉన్నత స్థాయి భద్రత కోసం హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌ని కూడా సృష్టించారు. వీటికి సంబంధించి.. ఇటీవలే కోల్‌కతాలో జరిగిన కంబైన్డ్ కమాండర్ల సమావేశంలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి.. ప్రధాని మోడీ కూడా హాజరైనట్లు సమాచారం. థియేటర్ కమాండ్‌ల లాంటి కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందే.. త్రివిధ దళాలు వారి శక్తి, సామర్థ్యాలను అర్థం చేసుకునేందుకు, పరస్పర అవగాహన పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయ్. అయితే.. థియేటర్ కమాండ్‌ల సృష్టిపై.. మన బలగాలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. కోల్‌కతాలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించిన నిర్ణయాల ప్రకారం.. తొలి దశలో తిరువనంతపురం, విశాఖపట్నం, గాంధీనగర్‌లలో 3 ఉమ్మడి మిలటరీ స్టేషన్లతో.. ఒక ఎడ్యుకేషన్ కార్ప్స్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్రివిధ దళాల సిబ్బంది కలిసి ట్రైనింగ్ పొందేందుకు, సహకరించుకునేందుకు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేందుకు వీలుగా ఎంపిక చేసిన కోర్సుల ఖాళీలు, సిలబస్‌లను కొత్తగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పరిమిత స్థాయిలో ఉన్న త్రివిధ దళాల కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ని కూడా డేటా షేరింగ్ కోసం మరింత విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌ల ఏర్పాటు.. భారత రక్షణ సామర్థ్యాలలో విప్లవాత్మకమైన మార్పులకు దారితీయనుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు.. ఒకే కమాండ్ కింద పనిచేయడం వల్ల.. యుద్ధ సమయాల్లోనూ, ఇతర కార్యకలాపాల్లో వేగవంతమైన, మెరుగైన సమన్వయం సాధ్యమవుతుంది. ఇది.. మూడు సేనల మధ్య జాయింట్ వార్‌ని అభివృద్ధి చేయనుంది.
ఒకే కమాండర్ ఆధ్వర్యంలోకి ఆస్తులు, వనరులు
భారత త్రివిధ దళాలైన.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. వేర్వేరు కమాండ్‌ల కింద పనిచేస్తున్నాయ్. అదే.. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌లు ఏర్పాటైతే.. ఈ 3 విభాగాల ఆస్తులు, వనరులు.. ఒకే భౌగోళిక ప్రాంతం కోసం.. ఒకే కమాండర్ ఆధ్వర్యంలోకి వస్తాయ్. ఇప్పుడిప్పుడే ఈ విషంలో.. త్రివిధ దళాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతోంది. కొన్ని నియమాలను, నిబంధనలను కూడా దశలవారీగా తొలగిస్తూ.. దళాల మధ్య సమన్వయం కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బలగాల మధ్య పరస్పర అవగాహన పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. థియేటర్ కమాండ్‍ల ఏర్పాటుతో.. అన్ని స్థాయిల్లో ఇంటర్-సర్వీస్ పోస్టింగులు పెరగనున్నాయి.
మరింత మెరుగుపడనున్న భారత రక్షణ సామర్థ్యాలు
థియేటర్ కమాండ్‌లు ఏర్పాటైతే.. భారత రక్షణ సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వనరులన్నీ ఒకే కమాండర్ కింద పనిచేయడం వల్ల.. యుద్ధ సమయాల్లోనూ, ఇతర కార్యకలాపాల్లోనూ వేగవంతమైన, మెరుగైన సమన్వయం సాధ్యమవుతుంది. అంతేకాదు.. వనరులు, ఆయుధాలు, లాజిస్టిక్స్, ట్రైనింగ్ లాంటి వాటన్నిటినీ.. మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. దీని వల్ల.. ఖర్చు ఆదా అవుతుంది. మూడు సర్వీసుల నుంచి.. వేర్వేరుగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా.. థియేటర్ కమాండర్ వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సంక్షోభ సమయాల్లో రాపిడ్ రెస్పాన్స్‌కు ఇది సహాయపడుతుంది. ఇది.. త్రివిధ దళాల మధ్య జాయింట్ వార్ ఫైటింగ్ అభివృద్ధికి దారితీస్తుంది.
థియేటర్ కమాండ్‌తో పెరగనున్న దళాల శక్తి సామర్థ్యాలు..
థియేటర్ కమాండ్ వివిధ సేవలను.. శక్తివంతమైన, సమగ్ర పోరాట యంత్రంలా ఉపయోగిస్తుంది. దీనివల్ల ప్రతి దళం శక్తి సామర్థ్యాలు పెరుకుతాయి. ప్రతి కమాండ్‌కు ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం కేటాయించడం వల్ల.. ఆ ప్రాంతంలోని భద్రతా ముప్పులకు అనుగుణంగా ప్రత్యేకమైన సైనిక వ్యూహాలను రూపొందించడం, అమలు చేయడం సులభమవుతుంది. సైబర్ వార్, స్పేస్ వార్ లాంటి కొత్త పోరాట సామర్థ్యాలను కూడా ఈ కమాండ్‌ల ద్వారా లింక్ చేయొచ్చు. దాని వల్ల భారత్ మల్టీ డొమైన్ వార్‌ఫేర్‌కు సిద్ధంగా ఉంటుంది. అన్ని సేవల సిబ్బంది జాయింట్ ట్రైనింగ్, క్రాస్ పోస్టింగ్‌లో పాల్గొంటారు. ఇంటి గ్రేటెడ్ థియేటర్ కమాండ్.. ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు.. భారత సైనిక శక్తి సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇప్పటికే మన పక్కనున్న చైనా.. రెండేళ్లలోపై థియేటర్ కమాండ్‌ల ఏర్పాటుని పూర్తి చేసింది. కానీ.. భారత్ మాత్రం రెండు దశాబ్దాలకు పైగా ఈ సంస్కరణలపై చర్చించింది. ఈ గ్యాప్‌లో.. మన శత్రు దేశాలు తమ దళాల సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. పాక్, చైనా నుంచి ఎదురయ్యే సవాళ్ల స్వభావం మారుతూ వస్తోంది. శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే.. ప్రధాని మోడీ 2019లోనే థియేటర్ కమాండ్‌ల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టాల్సిందిగా ఆదేశించారు.
Also Read: తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక మలుపులు
ఇండియన్ నేవీ నేతృత్వంలో మారి టైమ్ థియేటర్ కమాండ్.. కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దేశంలోని సముద్ర సరిహద్దులు, సముద్ర జోన్ నుంచి ముప్పులను.. ఈ కమాండ్ చూసుకోనుంది. త్రివిధ దళాల కార్యాచరణని, బలగాల నుంచి రాపిడ్ రెస్పాన్స్‌ని పెంచే లక్ష్యంతో.. 150 కంటే ఎక్కువ అంశాలను అమలు చేసేందుకు సైనిక వ్యవహారాల శాఖ కృషి చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌ల ఏర్పాటు భారతదేశ రక్షణ వ్యవస్థలో నిర్మాణాత్మకమైన సంస్కరణగా చెబుతున్నారు. ఇది సైన్యంలో సమైక్యతని పెంచి, భద్రతా పరమైన ముప్పులని.. సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు దోహదపడుతుంది.
Story By Anup, Bigtv