Businessman Khemka Murder| ఒక ప్రముఖ వ్యాపారవేత్తను నడిరోడ్డుపై హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఇది జరిగింది. కొందరు దుండగలు బైక్ పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. ఇదంతా ఒక్కసారిగా క్షణాల్లో జరిగిపోయింది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ఆయన కుమారుడిని కూడా ఇలాగే హత్య చేశారు.
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త, బిజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కాను గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి హత్య చేశారు. ఆయన మగధ్ హాస్పిటల్ యజమాని, బాంకిపూర్ క్లబ్ డైరెక్టర్. ఈ ఘటన శుక్రవారం రాత్రి గాంధీ మైదాన్ ప్రాంతంలోని ఆయన నివాసానికి సమీపంలోని పనాచే హోటల్ వద్ద జరిగింది. ఆరు సంవత్సరాల క్రితం.. 2018లో గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ ఖేమ్కా (38) కూడా ఇలాంటి విధానంలోనే వైశాలిలోని తన కాటన్ ఫ్యాక్టరీ వద్ద హత్యకు గురయ్యాడు.
గోపాల్ ఖేమ్కా రాత్రి 11:40 గంటలకు తన కారు నుండి దిగుతుండగా.. బైక్‌పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన సోదరుడు శంకర్.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఘటన జరిగిన దాదాపు మూడు గంటల తర్వాత.. అంటే రాత్రి 2:30 గంటలకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. గోపాల్ ఖేమ్కా తన నివాసానికి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగిందని ఆయన తెలిపారు.
ఈ హత్యతో రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపింది. ఎందుకంటే మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీ పప్పు యాదవ్.. బిహార్ లో సిఎం నీతీష్ కుమార్ ప్రభుత్వంపై పరిపాలనా విధానాలు సరిగా లేవని విమర్శించారు. ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించి.. ఖేమ్కా కుటుంబాన్ని ఓదార్చారు. RJD నాయకుడు రిషి మిశ్రా కూడా NDA ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. నీతీష్ కుమార్ ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయిందని, ముఖ్యమంత్రి అపస్మారక స్థితిలో ఉన్నారని అన్నారు. పోలీసులు సమాచార సేకరణలో నిమగ్నం కాకుండా, మద్యం స్మగ్లర్లను పట్టుకోవడంలో బిజీగా ఉన్నారని, దీనివల్ల ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారని ఆయన ఆరోపించారు.
పాట్నా సీనియర్ పోలీసు అధికారి దీక్షా కుమారి మాట్లాడుతూ.. ఈ ఘటనపై అన్ని కోణాల నుండి దర్యాప్తు జరుగుతోందని, సమీపంలోని CCTV ఫుటేజీని సమీక్షిస్తున్నామని తెలిపారు. “జులై 4 రాత్రి 11 గంటల సమయంలో, వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను గాంధీ మైదాన్ దక్షిణ ప్రాంతంలో కాల్చి చంపారని సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని సీల్ చేశాము. ఒక బుల్లెట్, ఒక షెల్ సేకరించాము. దర్యాప్తు కొనసాగుతోంది,” అని ఆమె చెప్పారు.
Also Read: నటుడు విజయ్ అభిమాని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు
2018లో, గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ కూడా పట్టపగలు వైశాలిలోని తన కాటన్ ఫ్యాక్టరీ వద్ద కారు నుండి దిగుతుండగా బైక్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. ఈ రెండు హత్యలూ ఒకే విధంగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు హత్యల వెనుక ఒకే వ్యక్తి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.