TVK Worker Suicide| ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్ అభిమాని, అతని రాజకీయ పార్టీ టివికె కార్యకర్త ఒకడు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయేముందు అతను రాసిన సూసైడ్ నోట్ లో కొందరు తనను తీవ్రంగా వేధించారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు. ఆ వేధింపులు గురించి అతను వివరంగా రాశాడు. అవి చూస్తే దీన పరిస్థితిలో ఉన్న అతడిని ఎంతగా అవమానించారో అర్థమవుతోంది.
తమిళనాడులోని పుదుచ్చేరికి చెందిన 33 ఏళ్ల చిన్న వ్యాపారి విక్రమ్ అప్పుల భారం, వడ్డీ వ్యాపారుల వేధింపుల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. విక్రమ్ తన కుటుంబాన్ని పోషించడానికి ఒక చికెన్ షాప్ నడిపేవాడు. కానీ, ఒక ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉండడంతో అప్పులు తీర్చలేకపోయాడు. కానీ అప్పులు ఇచ్చిన వారు తీవ్రంగా వేధించడం.. ఆ అవమానాలు భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్రమ్ తన ఆత్మహత్య లేఖలో కొంతమంది వడ్డీ వ్యాపారుల పేర్లను పేర్కొన్నాడు. వారు తనను తీవ్రంగా వేధించారని, ఈ వేధింపులే తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయని రాశాడు. ఒక వడ్డీ వ్యాపారి, అప్పు తీర్చే వరకు అతడి (విక్రమ్) భార్య, కూతురిని తన ఇంటికి పంపమని, వ్యభిచారం చేయించమని అనుచితంగా డిమాండ్ చేశాడని విక్రమ్ ఆ లేఖలో పేర్కొన్నాడు.
విక్రమ్ రాసిన లేఖలోని వివరాల ప్రకారం.. అతడు గతంలో రూ.3.8 లక్షల వరకు అప్పులు చేశాడు. దానికి భారీగా వడ్డీ రేటు ఉండడంతో.. నెలకు రూ.38,000 వడ్డీ చెల్లిస్తున్నానని, అంటే నెలకు 10% వడ్డీ రేటు ఉందని తెలిపాడు. మరొక వ్యాపారి, రూ.30,000 అప్పుకు నెలకు రూ.6,000 వడ్డీ డిమాండ్ చేశాడని చెప్పాడు. కారు ప్రమాదం తర్వాత విక్రమ్ నడవలేని స్థితిలో బెడ్ రూమ్ కే పరిమితమైన తరుణంలో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. దీంతో అతను అతని కుటుంబం అప్పుల ఊబిలో, భయంతో, నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు.
తమిళ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో స్థానిక కార్యకర్తగా పనిచేసేవాడు. తన ఆత్మహత్య లేఖలో, తన భార్య, కూతురిని కాపాడాలని తన అభిమాన నాయకుడు విజయ్‌ని హృదయవిదారకంగా వేడుకున్నాడు.
పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు. లేఖలో పేర్కొన్న వడ్డీ వ్యాపారుల గుర్తింపు వారి కార్యకలాపాలను ధృవీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు జరగలేదు.
ఈ ఘటన తమిళనాడు, పుదుచ్చేరిలో నియంత్రణ లేని అధిక వడ్డీ వ్యాపారాలపై మళ్లీ ఆందోళనలను రేకెత్తించింది. చిన్న వ్యాపారులను, బలహీనమైన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని, చట్టవిరుద్ధంగా అప్పులిచ్చే ఈ నెట్‌వర్క్‌లు తరచూ చట్టపరిమితులను దాటి పనిచేస్తాయి.
అధికారులు ఈ విషయంలో లోతైన దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. విక్రమ్ మరణం సోషల్ మీడియాలో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. చాలా మంది చట్టవిరుద్ధ వడ్డీ వ్యాపారాన్ని అరికట్టాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.