Chhattisgarh Encounter: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. లేటెస్ట్‌గా మావోయిస్టులకు-భద్రతా బలగాలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టాయి బలగాలు.
ఛతీస్‌గఢ్‌లో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎలాగ లేదన్నా వారానికి ఒక ఎన్‌కౌంటర్ జరుగుతోంది. తాజా ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్ మరణించారు. దక్షిణ అబుజ్మద్ ప్రాంతంలో గురువారం వేకువజామున మూడుగంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నారాయణపూర్- దంతేవాడ- జగదల్‌పూర్- కొండగావ్ జిల్లాల అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ చేపట్టాయి. డీఆర్జీ-ఎస్టీఎప్, సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. బలగాలు కూంబింగ్ చేస్తుండగా వారిపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు.
ఇరువర్గాల మధ్య నాలుగైదు గంటల సేపు కాల్పులు చోటు చేసుకుంది. మావోల వైపు నుంచి తుపాకుల శబ్దం నెమ్మదించడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. వేర్వేరు ప్రాంతంలో 12 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మావోలు వెళ్లిన దారిలో రక్తపు మరకలు కనిపించడంతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
ALSO READ: భార్యకు భరణం ఎంత ఇవ్వాలో లెక్కలు చెప్పిన సుప్రీం కోర్టు..
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో దాదాపు 230 మంది మావోయిస్టులు మరణించినట్టు అధికారులు చెబుతున్నమాట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఆయా ఎన్‌కౌంటర్లు జరిగాయి. అయితే గురువారం నాటి ఆపరేషన్‌లో దాదాపు 1000 మంది భద్రతా బలగాలు మెహరించాయి.