Supreme Court Alimony| కట్నం వేధింపుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఒక యువకుడు (సాఫ్ట్‌వేర్ ఉద్యోగి – అతుల్ శుభాష్) ఇటీవల ఒక వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. దేశంలోని చట్టాలు పురుషులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. అన్యాయంగా తన వద్ద ఎక్కువ భరణం పొందడానికే తన భార్య తప్పుడు కేసు పెట్టిందని వీడియోలో తెలిపాడు. తనను పోలీసులు, కోర్టులో న్యాయమూర్తి అందరూ వేధించారని, అపహాస్యం చేశారని వీడియోలో పేర్కొంటూ తాను వివిక్ష పూరితమైన చట్టాల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటానని కారణాలు చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుని పరిశీలించిన సుప్రీం కోర్టు ఇప్పటికే దేశంలోని అన్ని కోర్టులకు హెచ్చరిస్తూ.. కట్నం వేధింపుల చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని.. అందువల్ల ఈ కేసుల విచారణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఈ క్రమంలో విడాకుల తరువాత భార్యకు ఎంత భరణం ఇవ్వాలో లెక్కించడానికి 8 అంశాలు పరిగణించాలని సూచించింది.
సుప్రీం కోర్టులోని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పివి వరాలెతో కూడిన దిసభ్య ధర్మాసనం.. మంగళవారం ఒక విడాకుల కేసు విచారణ తరువాత దేశంలోని అని న్యాయస్థానాలకు భరణం విషయంలో ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది.
– భర్త, భార్య.. ఇద్దరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు
– భవిష్యత్తులో భార్య, పిల్లల కనీస అవసరాలు,
– భర్త, భార్య విద్యార్హత, వారి వృత్తి, ఉద్యోగం
– ఇద్దరి ఆదాయం, ఆస్తి
– అత్తగారింట్లో ఉన్న సమయంలో భార్య ఆర్థిక జీవన విధానం (ఆమె నెలవారి ఖర్చులు)
– కుటుంబ పోషణ కోసం సదరు భార్య తన ఉద్యోగం లేదా వృత్తి త్యాగం చేసిందా?
– భార్య విడాకుల కేసు వాదన కోసం కూడా భర్త ఖర్చు చేయాలి
– భర్త సంపాదన, భరణంతో పాటు అతని ఇతర బాధ్యతలకు అయ్యే ఖర్చులు
పై తెలిపన అంశాలన్నీ మార్గదర్శకాలుగా తీసుకోవాలని.. వీటిని ఒక ఫార్ములాగా తీసుకోకూడదని సుప్రీం కోర్టు సూచనలు చేసింది. శాశ్వతంగా భరణం నిర్ధరణ సమయంలో భర్తకు ఇది ఒక శిక్షగా మారకూడదని.. కేవలం విడాకులు తరువాత భార్యకు ఆర్థికంగా భద్రత కలిగించే ఉద్దేశంతోనే వ్యవహరించాలిన చెప్పింది.
Also Read: జగ్దీప్ ధనఖర్‌పై అవిశ్వాస తీర్మానం చెల్లదు.. పార్లమెంటు నియమాలు ఇవే..
కట్నం వేధింపుల మరో కేసు విచారణ చేసిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. భర్తపై పగ సాధించడానికే కొందరు మహిళలు.. ఈ చట్టాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారని చెప్పారు.
బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే అతుల్ సుభాష్ భరణం, విడాకుల కేసు వివరాలు..
2019లో ఒక మాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా అతుల్, నికితా కలిసి వివాహం చేసుకున్నారు. అతుల్ బెంగుళూరులో కుటంబంలో స్థిరపడగా.. నికిత ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్ పూర్ లో తన తల్లిదండ్రులతో నివసించేంది. పెళ్లి జరిగిన ఏడాది తరువాత వారిద్దరికీ ఒక పిల్లాడు కూడా పుట్టాడు. కానీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి నికిత తన కొడుకుని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
తన భర్త తనను కొట్టేవాడని, అత్తమామలు రూ.10 లక్షలు కట్నం కోసం వేధించేవారని విడాకులు, కట్నం వేధింపుల కేసు పెట్టింది. అయితే కేసు విచారణ సమయంలో తాను భర్త ఇల్లు వదిలేసే సమయంలో.. తన భర్త అతుల్ సంవత్సరానికి రూ.40 లక్షలు సంపాదించేవాడని.. అయితే అతని సంపాదన ఇప్పుడు రూ.80 లక్షలు ఉంటుందని పేర్కొంది. తన భర్త కట్నం కోసం వేధించడం కారణంగానే తన తండ్రి గుండెపోటుతో మరణించాడని పేర్కొంది.
మరోవైపు అతుల్ ఆత్మహత్య చేసుకునే ముందు వీడియోలో ఇదంతా తప్పుడు ఆరోపణలని లాజికల్ గా వాదించాడు. తన సంపాదన రూ.40 లక్షలు, రూ.80 లక్షలు అని స్వయంగా నికిత కోర్టులో చెప్పిందని.. మరి అంత సంపాదన ఉన్న తాను ఎందుకు కేవలం రూ.10 లక్షల కోసం కకుర్తి పడతానో అర్థం లేని ఆరోపణలని కొట్టిపారేశాడు. తాను భార్యను కొట్టినట్లు ఒక్క ఆధారం కూడా చూపలేదని.. ఇక నికిత తండ్రి గత 10 సంవత్సరాలుగా గుండె సమస్యలతో బాధపడుతున్నారని.. డాక్టర్లు ఆయన కేవలం మూడు నాలుగు నెలలకు మించి జీవించడని ముందే చెప్పారని అన్నాడు. భరణం కోసం ముందుగా రూ.1 కోటి డిమాండ్ చేసిన తన భార్య.. తాను అందుకు అంగీకరించడంతో ఇప్పుడు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందని అన్నాడు.
అయితే కోర్టులో తనతో న్యాయమూర్తి అవమానకరంగా మాట్లాడారని.. అపహాస్యం చేశారని చెప్పాడు. చట్టాలు పురుషులను వేధించేందుకే రూపొందించారని.. ఈ చట్టాలు మారాలనే ఉద్దేశంతో.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని చనిపోయే ముందు చివరి మాటలు ఇవేనని అన్నాడు.