Delimitation Meet In Chennai: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఇవాళ చెన్నైలో కీలకమైన డీలిమిటేషన్ మీట్ జరగనుంది. సమావేశానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నాయకులు హాజరవుతున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు చెన్నైకి చేరుకున్నారు. పార్లమెంటరీ సీట్ల పునర్విభజనపై ఉన్న ఆందోళనలపై సమావేశంలో నేతలు చర్చించనున్నారు. పార్లమెంటరీ సీట్ల పునర్విభజన దక్షిణ రాష్ట్రాలను అసమానంగా ప్రభావితం చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
పార్లమెంటరీ సీట్ల పునర్విభజన-దక్షిణాది రాష్ట్రాలు, పరిమితి సమస్యలను చర్చించేందుకు అగ్రనేతలు చెన్నైలో సమావేశమవుతున్నారు. సీట్ల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు తగ్గింపును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ఈ ప్రధాన ప్రతిపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గుతుందనే భయాలపై దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసి పోరాటం సాగించే లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోందని తెలుస్తోంది.
ఈ మీట్ ను భారత సమాఖ్యవాదానికి చారిత్రాత్మక దినంగా పేర్కొన్న తమిళనాడు సీఎం స్టాలిన్.. న్యాయమైన ప్రాతినిధ్యం కోసం జాతీయ ఉద్యమంగా పరిణామం చెందిందని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. ఇది ఒక సమావేశం మాత్రమే కాదు.. మన దేశ భవిష్యత్తును రూపొందించే ఉద్యమ ప్రారంభం అని ప్రకటించారు.
ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ మీట్ లో చాలా మంది సీఎంలు, కీలక ప్రతిపక్ష నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరిలో కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతినిధులు సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. బీఆర్‌ఎస్ తరపున కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, వినోద్ కూడా హాజరవుతున్నారు. అటు.. ఏపీ నుంచి ప్రధాన పార్టీలు ఆ మీటింగ్‌కు దూరం ఉంటున్నాయి. టీడీపీ, జనసేన ఎన్డీయే కూటమిలో భాగస్వాములు కాగా.. బీజేపీని వ్యతిరేకిస్తున్నా.. చెన్నై మీటింగ్‌కు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయించింది.
Also Read: కర్ణాటకలో హనీ ట్రాప్ దుమారం.. అసెంబ్లీ నుంచి 18 మంది బిజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
ఎంపీ కనిమొళి, మంత్రి నెహ్రూ, కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా సహా డీఎంకే ప్రతినిధి బృందం మార్చి 13న ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. వారు కలిసిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం… సరిహద్దుల విభజన ముసుగులో దక్షిణాదిపై కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. అలా జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తిరగబడతాయని హెచ్చరించారాయన.
పార్లమెంటరీ సీట్ల పునర్విభజన అంశం పలు దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళనను రేకెత్తిస్తోంది. జనాభా ఆధారిత పునర్విభజన కారణంగా పార్లమెంటరీ సీట్ల కేటాయింపు…ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా మారుతుందని, దక్షిణాది రాష్ట్రాల్లో మరింతగా సీట్లు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమావేశాన్ని ముఖ్యమైన ప్రతిపక్షాల బల ప్రదర్శనగా చూడవచ్చు. నాయకులు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని అణగదొక్కే ప్రయత్నంగా భావించే అంశాన్ని తిప్పికొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇది పెద్ద రాజకీయ ఉద్యమానికి నాంది పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.