Mumtaz Patel: భారత క్రికెట్ జట్టు ఎంపికలో మతపరమైన వివక్ష ఉందంటూ సహచర పార్టీ నేత ఇమ్రాన్ మసూద్ (Imran Masood) చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ముంతాజ్ పటేల్ (Mumtaz Patel) తప్పుబట్టారు. ఆయన పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా చురకలు అంటించారు. జట్టు ఎంపికలు ఎల్లప్పుడూ ఆటగాళ్ల ఫామ్ ఆధారంగానే జరుగుతాయని, మతం ఆధారంగా కావని ఆమె స్పష్టం చేశారు. కొందరు దేశంలో మతపరమైన విభజన వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తుది జట్టులో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడానికి అతని మతమే కారణమని కాంగ్రెస్ ఎంపీ మసూద్ ఆరోపించారు. దీనిపై ముంతాజ్ తాజాగా స్పందిస్తూ.. క్రీడల్లో మతపరమైన విభజనకు తావులేదన్నారు. దేశంలో క్రికెట్ అత్యున్నత క్రీడగా విరాజిల్లుతోందని.. మతాలకు అతీతంగా ప్రజలు క్రికెట్ ను ఆదరిస్తున్నారని చెప్పారు. కాబట్టి క్రీడాకారులకు సైతం మతాలు ఆపాదించడం సరైన పద్దతి కాదనన్నారు. ఆటగాడి ఫామ్, మ్యాచ్ పరిస్థితులకు ఎవరైతే సరిపోతారని భావిస్తారో వారినే టోర్నమెంట్లకు ఎంపిక చేస్తూ వస్తున్నారని ముంతాజ్ అన్నారు.
రాష్ట్రం, మతం, సంస్కృతి, కులం మరేదైనా పేరుతో క్రికెట్ విడిపోవడాన్ని తాను ఎన్నడూ చూడలేని మహిళా ఎంపీ అన్నారు. వీటన్నింటినీ క్రికెట్ కు దూరంగా ఉంచుదామన్నారు. అదే సమయంలో దేశంలోనూ విద్వేష, విభజన పూరిత వాతావరణాన్ని సృష్టించవద్దని సూచించారు. ప్రజలను విభజిస్తూ చేసే ప్రసంగాలు.. దేశంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ఐక్య భారత్‌గా నిలుద్దాం. ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే మనమంతా టీమ్ ఇండియాగా ఒక్కటే’ అని ముంతాజ్ చెప్పుకొచ్చారు.
మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. అతని మతం వల్లే సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించారని శుక్రవారం మసూద్ ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. ‘మంచి ప్రదర్శన చేసినప్పటికీ అతనికి జట్టులో చోటు ఇవ్వలేదని అంటున్నారు. అతని పేరు సిరాజ్ కాబట్టే జట్టులో అవకాశం ఇవ్వలేదు. మంచి ప్రదర్శన ఇస్తున్నా ఎంపిక చేయకపోవడం పట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది’ అని మసూద్ అన్నారు. తన వాదనకు బలం చేకూర్చేలో సిరాజ్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్, మహమ్మద్ షమీ పేర్లను సైతం ఆయన ప్రస్తావించారు.
Also Read: ‘కూతుళ్లు వద్దు.. కొడుకు కావాలి’.. భార్యకు ఫోన్ మెసేజ్‌తో తలాక్ చెప్పిన భర్త!