
Congress party news today(Latest political news in India):
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది ఎన్నికల మేనిఫెస్టో. ఇందులో పొందుపరిచిన అయిదు ఉచిత హామీలు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. హామీలను ఇవ్వడం వరకే పరిమితం కాలేదు కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వాటి అమలుకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పిస్తోంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దీన్ని అమలు చేసింది. గృహ జ్యోతి స్కీమ్ కూడా అమల్లోకి వచ్చింది. జులై 1 నుంచి గృహావసర వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతిని ప్రారంభించింది సిద్ధరామయ్య సర్కార్.
తాజాగా గృహలక్ష్మీ పథకాన్ని ప్రారంభించింది. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతి నెలా 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దీన్ని లాంఛనంగా ఆరంభించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ పథకం ఆరంభమైంది. దీనికోసం మైసూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది సిద్ధరామయ్య సర్కార్. ఈ సభా వేదిక మీద- బటన్ నొక్కి ఈ నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు రాహుల్ గాంధీ.
ఈ సభలో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వాటర్ బాటిల్ మూత తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయనకు సాధ్యం కాకపోవడంతో పక్కనే ఉన్న రాహుల్ గాంధీ సాయం చేశారు. వాటర్ బాటిల్ మూత తీయడమే కాకుండా.. గ్లాసులో నీరు పోసి మల్లికార్జున ఖర్గేకు అందించారు. దీనికి మల్లికార్జున ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు.