
Telangana congress party news(Latest news in telangana):
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిన జోష్‌తో నేతల్లో పోటీ పెరిగింది. అసెంబ్లీ బరిలో నిలిచేందుకు లీడర్లు ఉత్సాహం కనబరుస్తున్నారు. బయట నుంచి వచ్చే లీడర్లకు టికెట్లు ఇవ్వడం, సీనియర్లకు ప్రాధాన్యత కల్పించడం.. కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములా మారింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ ట్రబుల్‌తో అధిష్ఠానం సతమతమవుతోంది. కొందరు నేతలు తమతో పాటు కుటుంబ సభ్యులకు కూడా టికెట్ కావాలంటూ పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది.
ఒకటికి మించి టికెట్లు అడుగుతున్న లీడర్ల లిస్ట్ పెద్దగానే ఉంది. ఈ జాబితాలో జానారెడ్డి, కొండా సురేఖ, బలరాంనాయక్, సీతక్క, అంజన్ కుమార్‌లు ఉన్నారు. అలాగే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరాలనుకుంటున్న నేతలు కూడా రెండు టికెట్లు కావాలని పట్టుబడుతున్నారు. మైనంపల్లి హన్మంతరావు, రేఖానాయక్ కూడా రెండు టికెట్లు కావాలని గట్టిగా అడుగుతున్నారు.
కుటుంబంలో ఒకరికి మించి ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దల నో చెప్పడంతో ఆశావహుల్లో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. ఫ్యామిలీ ప్యాక్ మాట పక్కన పెట్టాలని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. కొందరు వినడం లేదు. ఈ పరిస్థితిలో అటు అధిష్ఠానానికి, ఇటు ఆశావహులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఇక.. తాను, తన భార్య కోదాడ, హుజూర్‌నగర్‌కు మకాం మార్చినట్టు చెప్పారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ రెండు సెగ్మెంట్లలో 50 వేల మెజారిటీ తగ్గితే రాజకీయాలు చేయనని అన్నారు. పార్టీ పోటీ చేయొద్దంటే చేయనని, ఎంపీ ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
అటు.. టికెట్ల పంచాయితీపై కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టారు. నేతల్ని బుజ్జగిస్తూ, బలమైన అభ్యర్థులను బరిలో దింపేలా కసరత్తు చేస్తున్నారు.