
Asia cup latest match(Latest sports news today) :
ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. పసికూన నేపాల్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ (151, 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులు) , ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్ 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీలతో చెలరేగారు. ఒక దశలో పాక్ 124 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బాబర్, ఇఫ్తికార్ తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 5 వికెట్ కు ఈ జోడి 214 పరుగులు జోడించింది. నేపాల్ బౌలర్లలో సోంపాల్ 2 వికెట్లు, కరన్, సందీప్ తలో వికెట్ తీశారు.
343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ను తొలి ఓవర్ లో నే షాహిన్ షా ఆఫ్రిది దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి పసికూనకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏ దశలో నేపాల్ జట్టు పోరాటం చేయలేదు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్ల కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయారు.
పాక్ బౌలర్ల దాటికి నేపాల్ 104 పరుగులకే కుప్పకూలింది. సోంపాల్ (28), ఆరీఫ్ షేక్ (26), గుల్షన్ ఝా (13) మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. పాక్ బౌలర్లలో షాబాద్ ఖాన్ 4 వికెట్లు, షాహిన్ షా ఆఫ్రిది , హరీష్ రౌఫ్ రెండేసి వికెట్లు, నషీమ్ షా, మహ్మద్ నవాజ్ తలో వికెట్ తీశారు. 23.4 ఓవర్లలోనే నేపాల్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
కెరీర్ లో 19వ సెంచరీ కొట్టిన బాబర్ అజామ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పాకిస్థాన్ తన తర్వాత మ్యాచ్ లో భారత్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 2 న ఈ మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది.