
Bharat name change news(Latest political news in India):
ఇండియా, భారత్ పేర్లపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. G- 20 సమావేశాలకు వచ్చే అతిథులకు పంపిన విందు ఆహ్వాన లేఖలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పేర్కొన్నారు. గతంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే రాసేవారు. ఇండియా స్థానం భారత్ అని పేరు మార్చడంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే తాజాగా ప్రధాని మోదీని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.
ఇండోనేషియాలో జరిగే 20వ ఆసియన్-ఇండియా సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొంటారు. దీంతోపాటు 18వ ఈస్ట్ ఏషియా సదస్సుకు హాజరవుతారు. ఈ వేడుకల కోసం రూపొందించిన ఇన్విటేషన్ లెటర్‌లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది. విపక్షాల కూటమికి ఇండియాగా నామకరణం చేసినందునే బీజేపీ ఇండియా పేరుకు బదులు భారత్‌గా మార్చుతోందని మోదీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు ప్రతిపక్ష నేతలు. త్వరలో తమ కూటమికి భారత్ అని పేరు పెడతామంటున్నాయి విపక్షాలు.
ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ సమావేశాలకు హాజరయ్యారు. ఆ నోటిఫికేషన్‌లో కూడా ఇండియా స్థానంలో భారత్ పేరును ఉపయోగించారు. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మోదీ గ్రీస్ పర్యటన సమయంలోనూ భారత్ పేరును వినియోగించారు. ఆగస్టు 22-25 మధ్యలో ఆ రెండు దేశాల్లో ప్రధాని పర్యటన నోటిఫికేషన్లలో ఇండియా స్థానంలో భారత్ పేరును పేర్కొన్నారు.
జీ-20 విదేశీ అతిథులకు పంపిణీ చేసే బుక్స్ పైనే భారత్ అని ముద్రించారు. ఈ సదస్సుకు నాయకత్వం వహించడాన్ని గుర్తు చేస్తూ ‘భారత్, ద మదర్ ఆఫ్ డెమోక్రసీ’గా పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్ అని ఉన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నాతాధికారులు గుర్తు చేస్తున్నారు. దీని కోసం తీర్మానం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.