Coronavirus : దేశంలో కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దాంతో మంగళవారం నాటికి జేఎన్.1 మొత్తం కేసుల సంఖ్య 69కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా గోవాలోనే ఈ కేసులు పెరగుతున్నాయని వెల్లడించాయి. ఈ వైరస్ సోకిన బాధితులు ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నాయి. ఆసుపత్రిలో చేరికల సంఖ్యలో పెరుగుదల కనిపించడం లేదన్నారు. ప్రస్తుతానికి ఈ వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం సూచించాయి.
కేరళలో కొన్ని రోజుల క్రితం ఈ జేఎన్.1 వేరియంట్‌కు సంబంధించి తొలి కేసు బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 79 ఏళ్ల మహిళకు కూడ జేఎన్ -1 సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. క్రియాశీల కేసులు 4,170కి చేరాయి. జేఎన్.1 గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.