Crematorium Wall Collapsed in Haryana: మృత్యువు ఎప్పుడు, ఎవరిని ఏ రూపంలో కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈ క్షణం సంతోషంగా ఉన్నా.. మరుక్షణం ఏం జరుగుతుందో అంతుచిక్కదు. స్మశానం గోడకూలి చిన్నారి సహా ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగింది. అర్జున్ నగర్ ప్రాంతంలో స్మశానవాటిక గోడకూలడంతో.. మైనర్ బాలిక సహా ఐదుగురు సజీవసమాధి అయినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
శనివారం (ఏప్రిల్ 20) సాయంత్రం 6.20 గంటల సమయంలో మదన్ పురి స్మశాన వాటిక వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఘటన తర్వాత స్మశానవాటిక కేర్ టేకర్, మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు పరారీలో ఉన్నారని, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరగడంతో.. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రమాద ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అర్జున్ నగర్ కాలనీలో కొందరు నివాసితులు ఆ గోడకు పక్కనే కుర్చీలలో కూర్చుని ఉండగా.. 15 -20 అడుగుల ఎత్తయిన గోడ అకస్మాత్తుగా కూలి వారిపై పడింది. మృతులు దేవిదయాల్ (70), క్రిషన్ (52), మనోజ్ గబా (54), తాన్య (11), కుష్బూ (10)గా గుర్తించారు. గాయపడిన వారిలో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read: విహారయాత్రలో విషాదం.. మహానదిలో పడవ బోల్తా..!
సుమారు రెండు నెలలుగా స్మశానం గోడ కూలిపోయేలా ఉందని, దానికి మరమ్మతులు చేయాలని నిర్వాహకుడికి చెప్పినా.. అతను పట్టించుకోలేదని తాన్య తల్లి వాపోయింది. ఆ గోడ పక్కనుంచి ఏ వాహనం వెళ్లినా అది కదులుతుందని, అప్పటి నుంచి ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతూ ఉన్నామని, ఈరోజు తన కూతురే ఆ గోడకు బలైందంటూ గుండెలవిసేలా రోధించింది.