Dating Fraud| ఎక్కడైనా హోటల్ లేదా రెస్టారెంట్ కు వెళితే.. అక్కడ సాధారణంగా భోజనం రూ.100 నుంచి రూ.200 ఉంటుంది. లేదా ఏదైనా 5 స్టార్ హోటల్ ఉంటే అదే ఐటెమ్ రూ.500 నుంచి రూ.2000 వరకు అవుతుంది. కానీ ఒక రెస్టారెంట్లో మాత్రం కస్టమర్లు అక్కడికి వెళ్లి ఏమైనా తిన్నా, తాగినా.. వేలు లక్షలు వసూలు చేస్తారు. అన్యాయంగా అంత బిల్లు ఏంటి? అని ప్రశ్నిస్తే.. బిల్లు రెండింతలు, మూడింతలు అవుతుంది. ఇలాంటి రెస్టారెంట్లు ఇటీవల దేశంలోని ప్రధాన నగరాల్లో దొంగచాటుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఒక రెస్టారెంట్ నిర్వహకులను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్ లో వారం రోజుల క్రితం ఒక యువకుడికి ఆన్‌లైన్ లో ఓ యువతి పరిచయమైంది. ఆమె ఒక ప్రత్యేక డేటింగ్ యాప్ ద్వారా అతడని కలుసుకుంది. ఆ తరువాత ఆ యువకుడిని ఒక రెస్టారెంట్‌కు డేటింగ్ కోసం రావాలని పిలిచింది. ఆ రెస్టారెంట్ నగరంలోని కౌషంబి మెట్రో స్టేషన్ వద్ద ఉందని తెలిపింది. ఆ యువకుడు యువతిని కలుసుకునేందుకు అక్టోబర్ 21న కౌషంబి మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లాడు. స్టేషన్ బయట ఆ అందమైన యువతి ముందుగానే అతని కోసం ఎదురు చూస్తూ ఉంది.
Also Read: ఇద్దరు భర్తలను వదిలి అక్క మొగుడితో సహజీవనం.. అనుమాస్పద స్థితిలో మృతి
యువకుడు అక్కడికి చేరుకోగానే అతడిని ఎక్కడైనా కూర్చొని మాట్లాడుదామని చెప్పి.. సమీపంలోని కౌషంబి హోటల్ కు తీసుకెళ్లింది. ఆ హోటల్ ఫస్ట్ ఫ్లోర్ లో టైగర్ కేఫ్ అని రెస్టారెంట్ ఉంది. ఆ కేఫ్ బయట ఎటువంటి సైన్ బోర్డ్ లేదు. లోపల మాత్రం కేఫ్ అందంగా అలంకరించి ఉంది. కేఫ్ రూపురేఖలు చూసి ఆ యువకుడికి అనుమానం కలిగింది. అయినా తాను వచ్చిన పనిలో పడి అవన్నీ నిర్లక్ష్యం చేశాడు. ఆ యువతి ఇద్దరి కోసం కూల్ డ్రింక్ ఆర్డర్ చేసింది. ఇద్దరూ కూల్ డ్రింక్ తాగుతూ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంతలో ఆ హోటల్ సిబ్బంది ఒకరు వారికి బిల్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ యువకుడు బిల్ చూడగానే అతని కళ్ల చెదిరిపోయాయి. బిల్ మొత్తం. రూ.16400 అని ఉంది. దీంతో ఆ యువకుడు ఇంత బిల్ ఏంటి? అని ప్రశ్నించాడు.
ఆ హోటల్ సిబ్బంది అతని వైపు కోపంగా చూశారు. ఈ రెస్టారెంట్ లో అన్ని వస్తువులు ఫ్యాన్సీ ధరకే విక్రయిస్తామని చెప్పారు. దీంతో ఆ యువకుడు వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ మధ్యలో అంతవరకూ ఉన్న యువతి ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైంది. చివరకు ఆ రెస్టారెంట్ మేనేజర్ వచ్చి సెక్యూరిటి గార్డులైన పెద్ద పెద్ద బౌన్సర్లను తీసుకువచ్చాడు. ఆ యువకుడిని మర్యాదగా రూ.50000 బిల్లు చెల్లించమన్నాడు. ఇదంతా చూసి ఆ యువకుడికి తాను మోసపోయానని అర్థమైంది. తన ఫోన్ పేలో అంత డబ్బులు లేవని.. తన ఫ్రెండ్ నుంచి అప్పుగా తీసుకొని చెల్లిస్తానని వారికి చెప్పాడు. కానీ తెలివిగా తనకు జరిగిన అన్యాయాన్ని అంతా తన ఫ్రెండ్ కు మెసేజ్ చేసి వివరించాడు.
అర్దగంటలో ఆ యువకుడి ఫ్రెండ్ ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను తీసుకొని అక్కడికి చేరుకున్నాడు. విషయం అంతా తెలుసుకున్న పోలీసులు ఆ రెస్టారెంట్ లో పనిచేసే ముగ్గురు పురుషులు, అయిదుగురు యువతులను అరెస్టు చేశారు. అక్టోబర్ 22న ఆ ప్రాంత పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. “కౌషంబి హోటల్ లో ఒక గ్యాంగ్ టైగర్ కేఫ్ అనే రెస్టారెంట్ ని అనుమతులు లేకుండా నడుపుతోంది. నిజానికి ఇది రెస్టారెంట్ కాదు. కేఫ్ నిర్వహకులైన గౌతమ్, ఇమ్రాన్, నదీమ్.. ఈ ముగ్గురూ కలిసి కొంతమంది యువతులను తమ కోసం డేటింగ్ ఫ్రాడ్ చేయడానికి నియమించుకున్నారు. ఈ యువతులంతా ఆన్ లైన్ లో డేటింగ్ పేరుతో యువకులను పరిచయం చేసుకొని.. ఆ తరువాత వారికి టైగర్ కేఫ్ కు తీసుకెళ్తారు. అక్కడేదో నామమాత్రంగా ఏదైనా తిన్నా.. తాగినా వేలల్లో బిల్లు వేస్తారు.
ఆ బిల్లు చెల్లించపోతే.. యువకులను ఖైదు చేసి.. డబ్బులు వసూలు చేస్తారు. ఇలాంటి ఫ్రాడ్ డేటింగ్ తో యువత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం.” అని చెప్పారు.