Delhi Air Pollution: ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆంక్షలు విధించడం లేదా కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించదని స్పష్టం చేసింది. ఢిల్లీలో నానాటికి పెరుగుతున్న కాలుష్యంపై దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పండుగవేళ పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. సాంప్రదాయ పద్ధతుల వైపు ప్రజలు మళ్లాని ధర్మాసనం సూచించింది.
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ మాట్లాడుతూ.. ‘మేము ఎన్ని ఉత్తర్వులు జారీ చేస్తే, అన్ని ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. ఇది మానవ నైజం’ అని పేర్కొన్నారు. కాలుష్య నివారణకు చట్టపరమైన ఆంక్షల కంటే ప్రజల ఆలోచనా విధానంలో, ప్రవర్తనలో మార్పు రావడం చాలా అవసరమని చెప్పారు. పండుగలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై జస్టిస్ బాగ్చి స్పందిస్తూ.. ప్రస్తుత రోజుల్లో పండుగలు జరుపుకునే తీరు మారిపోయిందని, ఇది కూడా సమస్యకు ఒక కారణమని అభిప్రాయపడ్డారు.
అయితే కాలుష్యానికి పేద వర్గాలను బాధ్యులను చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సీజనల్ వ్యాపారాలు, పండుగలపై ఆధారపడి జీవించే పేదలకు దీపావళి వంటి పండుగలు ఉపాధి మార్గాలని జస్టిస్ సూర్య కాంత్ గుర్తుచేశారు. ‘పేద ప్రజలు ఎలాంటి కాలుష్యాన్ని సృష్టించడం లేదు. నిజానికి వారే దీని వల్ల ఎక్కువ నష్టపోతున్నారు. ఆర్థిక స్థోమత ఉండి వనరులను విచ్చలవిడిగా ఉపయోగించే వారే కాలుష్యానికి ప్రధాన కారణం’ అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
మరోవైపు ఢిల్లీ కాలుష్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న పంట వ్యర్ధాల గురించి కూడా ధర్మాసనం ప్రస్తావించింది. పంట వ్యర్థాల సేకరణ కోసం మద్దతు ధరను ప్రభుత్వం ముందుగానే ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను గ్రామ పంచాయతీ స్థాయిలోనే అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.
మరోవైపు అమిసస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ కోర్టు దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో పడిపోతోందని, ఇక్కడి గాలి పీల్చడం రోజుకు 30 సిగరెట్లు తాగడంతో సమానమని పేర్కొన్నారు. పంట వ్యర్థాల దహనం ఢిల్లీ కాలుష్యంలో 14 శాతానికి కారణమవుతోందని తెలిపారు.
Also Read: సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ కోర్టు కీలక ఉత్తర్వులు!
ఢిల్లీ రోడ్లపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడం (విపరీతమైన ట్రాఫిక్) వల్ల వాహన ఉద్గారాలు విపరీతంగా పెరుగుతున్నాయని సీజేఐ అభిప్రాయపడ్డారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఇంజిన్ ఆఫ్ చేయకుండా చాలా సేపు వేచి ఉండటం వల్ల కాలుష్యం మరింత తీవ్రమవుతోందని అమిసస్ క్యూరీ కోర్టుకు తెలిపారు. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. కాలుష్య నియంత్రణకు కేంద్రం ఇప్పటికే సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. ఢిల్లీలోకి కేవలం ‘భారత్ స్టేజ్ 6’ (BS-6) ప్రమాణాలు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: 26/11 తరహా దాడికి స్కెచ్.. స్కూబా డైవర్లుగా లష్కరే ఉగ్రవాదులకు ట్రైనింగ్!