Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో పేలుడుతో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ భయానక దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురు నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రకోట వద్ద పేలుడు కేసును జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో పేలుడు ఘటనపై దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని NIAకు కేంద్ర హొం శాఖ ఆదేశించింది.
Read Also: Delhi Blasts: ఏ కోణాన్నీ కొట్టిపారేయడం లేదు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలిన కారు బాంబుకు సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. పేలుడుకు గురైన టీ20 కారు హర్యానాలోని గురుగ్రామ్ నార్త్ రైల్వే స్టేషన్(RTO)లో రిజిస్టర్ అయింది. ఆశ్చర్యకరంగా, ఈ కారు కేవలం ఒక సంవత్సరంలోనే ఏడుసార్లు చేతులు మారింది. పోలీసులు ఈ ఘటనను ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద కుట్రగా పేర్కొన్నారు. ఎన్ఐఏ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఫోరెన్సిక్ బృందాలు మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాయి.
సోమవారం (నవంబర్ 10) సాయంత్రం సుమారు 6.52 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా) సమీపంలో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్క్ చేసిన ఒక కారులో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మెట్రో స్టేషన్ సమీపంలోని సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక HR26 7674 నెంబర్ ప్లేట్ గల హ్యూందాయ్ కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆరు కార్లు, నాలుగు ఆటో రిక్షాలు, నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి.