Delhi Bomb Threats: దేశ రాజధానిలో బాంబు బెదిరింపుల కలకలం కొనసాగుతోంది. తాజాగా మరో రెండు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారంలో ఇలా బెదిరింపులు రావడం 11వ సారి. ఇప్పటి వరకు మొత్తం 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఏం జరిగిందంటే?
తాజాగా వచ్చిన బెదిరింపు మెయిల్స్ అనంతరం.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఎన్ఎస్‌జీ టీమ్‌లు ఆ స్కూళ్ల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. గంటలపాటు స్కూళ్లలోనూ పరిసరాలనూ శోధించిన.. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అధికారులు ఈ బెదిరింపులను “ఫేక్ అలర్ట్స్”గా ప్రకటించారు.
ఫేక్ మెయిల్స్ వెనుక ఎవరు?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈమెయిల్స్‌లో ఉపయోగించిన ఐపి అడ్రెసులు.. వర్చువల్ ప్రాక్సీలను ఉపయోగించి మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక టెక్నికల్ బృందం మెయిల్స్ పంపిన ప్లేస్, ఐడి, డివైజ్ ఆధారంగా వెబ్ ట్రేసింగ్ ప్రక్రియ చేపట్టింది. బెదిరింపులు పంపినవారు దేశీయంగా ఉన్నారా లేదా విదేశీ ఐపి ఉపయోగించారా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఫేక్ మెయిల్ పంపిన ఓ 12 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలుడు చేసింది ఒక మెయిల్ మాత్రమే అని తేల్చారు. మరి మిగతా వాటి సంగతేంటన్న దానిపై పోలీసులు ఫోకస్ చేశారు.
విద్యా సంస్థలు అప్రమత్తం
ఇటీవల ఈ బాంబు బెదిరింపులు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన.. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF), ఇండియన్ నేవీ ఆధ్వర్యంలోని స్కూళ్లకు రావడం గమనార్హం. అలాగే సాధారణ ప్రైవేట్, CBSE పాఠశాలలకూ బెదిరింపులు రావడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
పాఠశాలలకు సెలవు
ఈ నేపథ్యంలో పలు విద్యాసంస్థలు.. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు తాత్కాలికంగా సెలవు ప్రకటించాయి. విద్యార్థుల భద్రతే తమకు ప్రథమ కర్తవ్యం అని.. యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఈ బెదిరింపుల వల్ల తరగతుల నిర్వహణ అంతరాయం నెలకొంది. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్‌కి పంపించాలా లేదా అన్న సందిగ్ధంలో పడిపోతున్నారు.
పోలీసుల విజ్ఞప్తి
ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనరేట్.. ఒక ప్రకటన విడుదల చేసింది. అవాస్తవమైన బెదిరింపులతో ప్రజలను, విద్యార్థులను, తల్లిదండ్రులను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్న వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫేక్ బాంబు బెదిరింపులు IPC, IT చట్టాల ప్రకారం శిక్షార్హమని, ఇది జోక్ కాదు అని ప్రజలకు సూచించింది.
Also Read: దివ్యాంగులకు సూపర్ గిఫ్ట్.. కేవలం 9 కిలోలే.. ఆ వీల్‌చైర్ వచ్చేసింది!
ప్రజల నుంచి సహకారం అవసరం
ఈ తరహా ఘటనలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరింది. ఈ బెదిరింపులు నిజంగా జరగకపోయినా, సమాజంలో భయాన్ని కలిగిస్తున్నాయి. విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీసే ఈ చర్యలను.. ఏమాత్రం ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.