Delhi Metro: రాజధాని దిల్లీలో బుధవారం ఉదయం మెట్రో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఎదురైంది. భద్రతా కారణాల దృష్ట్యా నగరం పరిధిలోని 16 కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.
మూతపడిన కీలక స్టేషన్లు ఇవే
నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన మార్గాల్లోని స్టేషన్లను అధికారులు బంద్ చేశారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండీ హౌస్, ఐటీఓ, ఖాన్ మార్కెట్‌లతో పాటు లోక్ కళ్యాణ్ మార్గ్, దిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, జోర్ బాగ్, శివాజీ స్టేడియం వంటి స్టేషన్లు మూతపడిన వాటిలో ఉన్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ స్టేషన్లు మూసే ఉంటాయని డీఎంఆర్‌సీ స్పష్టం చేసింది.
ఇంటర్ ఛేంజ్‌కు వెసులుబాటు
స్టేషన్లు మూసివేసినప్పటికీ, ఇతర లైన్లకు మారే ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కొంత ఉపశమనం అందించింది. రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటీరియట్ స్టేషన్లలో ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారే ఇంటర్ ఛేంజ్ సౌకర్యం యధావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ స్టేషన్ల నుంచి బయటకు వెళ్లడం , లోపలికి రావడం మాత్రం కుదరదు.
నిరసనల వల్లే ఈ నిర్ణయం
దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదివరకు జులై 20న నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సమయంలో కూడా ముందస్తు జాగ్రత్తగా పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే.
రద్దీ సమయంలో ఉన్నపళంగా మెట్రో సేవలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టేషన్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
Also Read: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!