Delhi Stampede Incident: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనలో ఏం జరిగింది? ఈ ఘటనకు కారణం ఎవరు? రైల్వే అధికారులా? ప్రయాణికులా? లేక ఎవరైనా అలజడి రేపారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. అయితే ప్రత్యక్షసాక్షుల వెర్షన్ మరోలా ఉంది. ఇంతకీ తప్పెవరిది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్దాం.
రైల్వేస్టేషన్ లో ఏం జరిగింది?
మహా కుంభ మేళా నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదకర ఘటన జరిగింది. శనివారం రాత్రి ప్రయోగ్ రాజ్‌కు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యంగా వస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అనంతరం స్టేషన్‌లో భారీ రద్దీ నెలకొంది. కొద్దిసేపటికే తొక్కిసలాట దారి తీసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో దాదాపు 18 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మంది గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ ఘటన వెనుక ప్రత్యక్ష సాక్షుల వెర్షన్ మరోలా ఉంది. ఆదివారం కావడంతో మహా కుంభ మేళాకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో భక్తులు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారన్నది ప్రత్యక్ష సాక్షులు కళ్లతో చూసింది చెప్పారు. భక్తుల రద్దీని తగ్గించేందుకు రైల్వే అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా. అర్థరాత్రి నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఇందుకోసం ప్రయాణికులు భారీగా స్టేషన్ కు చేరుకున్నారు.
రైలులో సీట్ల కోసం ప్రయాణికులు పడి గాపులు కాశారు. స్టేషన్‌కు వచ్చిన వారిలో చాలా మందికి టిక్కెట్లు లేవు. వారు టికెట్ కొనాలన్నా ప్లాట్ ఫారమ్ మీదకు వెళ్లాల్సిందే. ఉన్న ప్రాంతం నుంచి ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సీట్లు ఉండవేమో అన్న భయంతో రైలు ఫ్లాట్ ఫారమ్ మీదకు రాగానే ఒక్కసారిగా ఎగబడ్డారు. టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు తాము టికెట్ తీసుకుంటామని ఓ మహిళ చెప్పింది. ప్రత్యేక రైలులో సీటు సంపాదించింది, కానీ ఆమె టిక్కెట్ కొనలేదని తెలుస్తోంది.
ALSO READ: నా తల్లి క్లినిక్‌పై దాడి చేశారు?.. భయంగా ఉంది.. మళ్లీ క్షమాపణలు చెప్పిన యూట్యూబర్ రణ్‌వీర్
ప్రత్యక్షసాక్షులు ఏం చెబుతున్నారు?
ప్రత్యేక రైళ్లలో చాలా మంది భక్తులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు లేకుండా వచ్చినవాళ్లు కొందరైతే.. టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కడానికి వచ్చినవారు మరికొందరు. రైలు ఎక్కి టిక్కెట్ తీసుకుందామని స్టేషన్ కు వచ్చినవారు మరికొందరు. మరోవైపు టికెట్లతో స్టేషన్ కు వచ్చినవారు ఇంకొందరు. ఇలా అన్ని వర్గాలు ప్రజలు రైలు ఎక్కాలన్నా కంగారుతో ఈ ఘటన జరిగిందని అంటున్నారు.
ప్లాట్‌ఫారమ్ 13లో ప్రయాణికులు భారీగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. 14, 15వ నెంబరు ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉంది. ఒక్కసారిగా భారీగా ప్రయాణికులు ఆ రైలు వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ కారణంగా తొక్కిసలాట జరిగి పలువురు స్పృహ కోల్పోయారు. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన రైలు ఆ ఫ్లాట్ ఫారమ్ మీద ఉంది. వేరే ప్లాట్‌ఫారమ్ మీద రైలు ఉందని, మరో రెండు రైళ్లు ఆలస్యమని తెలియడంతో తొక్కిసలాట జరిగింది.
ప్రయాణికులను నియంత్రించే పరిస్థితి కూడా అక్కడ లేదన్నది మరికొందరు చెబుతున్నారు. మరోవైపు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై హై లెవల్ కమిటీ దర్యాప్తు చేపట్టినట్టు రైల్వేశాఖ వెల్లడించింది. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల్ని సందర్శించారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు. శుక్రవారం ఒక్కరోజే ప్రయాగ్‌రాజ్‌కు నుంచి 328 రైళ్లల్లో దాదాపు 10.47 లక్షల మంది ప్రయాణించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.