Ranveer Allahabadia Chandrachud | ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో ఒక అభ్యర్థి తల్లిదండ్రులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తర్వాత, ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో మునిగిపోయాడు. ఆయన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. “అది నోరా? డ్రైనేజీనా?” అనే వ్యాఖ్యలు చేసినందుకు సామాజిక మాధ్యమాల్లో ఆయనపై తిట్లదండకం ప్రారంభమైంది. ఈ వివాదం నేపథ్యంలో, పలు రాష్ట్రాల్లో ఆయనపై ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడా?
రణ్వీర్ అల్హాబాదియా పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడని, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లపై ఆయన సోషల్ మీడియాలో స్పందించాడు. “నేను, నా టీం పోలీసులకు పూర్తి సహకరిస్తున్నాం. నేను వారికి అందుబాటులోనే ఉన్నాను. తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను, అనాలోచితంగా వారిని అవమానించాను. నన్ను క్షమించండి. ఈ విషయంలో నేను మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది,” అని పేర్కొన్నాడు.
Also Read: ఆదాయపు పన్ను సేవింగ్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. మోసపోతారు జాగ్రత్త!
తల్లి క్లినిక్‌పై దాడి
రణ్వీర్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో, “చాలామంది నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బెదిరిస్తున్నారు. కొందరు రోగులుగా నటిస్తూ నా తల్లి క్లినిక్‌కు వెళ్లి అక్కడ అల్లర్లు సృష్టించారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. పోలీసులు, భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది,” అని రాసుకున్నాడు.
సుప్రీంకోర్టులో పిటిషన్
రణ్వీర్ అల్హాబాదియాపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆయనకు న్యాయవాదిగా అభినవ్ చంద్రచూడ్ వ్యవహరించనున్నట్టు సమాచారం. అభినవ్ చంద్రచూడ్ ఎవరో కాదు, ఇటీవలే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యతల నుంచి రిటైర్ అయిన జస్టిస్ డీవై చంద్రచూడ్ కుమారుడే! అభినవ్ గత ఎనిమిదేళ్లుగా సుప్రీంకోర్టులో కేసులు వాదించలేదు. ఆయన బాంబే హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ ఒక సమావేశంలో తన ఇద్దరు కుమారులు అభినవ్ మరియు చింతన్ గురించి ప్రస్తావించారు. వారిని సుప్రీంకోర్టులో కేసులు వాదించమని కోరినట్టు తెలిపారు. అయితే, జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా ఉన్న సమయంలో వారు ఎలాంటి కేసులు వాదించలేదు. జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించారు.
అభినవ్ చంద్రచూడ్ నేపథ్యం
లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. అభినవ్ చంద్రచూడ్ ముంబై ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి 2008లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం.. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చదివారు. కొన్ని అంతర్జాతీయ న్యాయ సంస్థల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తోంది. అభినవ్ రాజ్యాంగం, స్వేచ్ఛా ప్రసంగాలకు సంబంధించి అనేక పుస్తకాలు రచించారు.
వివాదం నేపథ్యం
ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిపై రణ్‌వీర్ అలహాబాదియా కామెంట్ చేస్తూ.. నువ్వు మీ తల్లిదండ్రుల పడక గదిలో శారీరక సుఖం అనుభవిస్తుంటే చూస్తూ ఉండిపోతావా? లేక వారితో కలిసి చేస్తావా? అని అశ్లీలంగా ప్రశ్నించాడు. రణ్వీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. మరో యూట్యూబర్ సమయ్ రైనాకు చెందిన ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో రణ్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.