Delhi CM list: 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోందా? హస్తిన పీఠంపై రోజుకో వార్త వెలుగులోకి వస్తోందా? ప్రధాని విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకు రకరకాలుగా ప్రచారం కంటిన్యూ అవుతోందా? ముఖ్యమంత్రి పీఠం ఈసారి మహిళలకు దక్కనుందా? డిప్యూటీ సీఎం పదవి దళితులకు ఇవ్వనున్నారా? అవుననే సంకేతాలు కమలనాధుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 సీట్లకు గాను 48 సీట్లను దక్కించుకుంది. ఈ క్రమంలో కొత్త సీఎం ఎవరనేదానిపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మొదట కీలక నేతల పేర్లు వినిపించినా, మహిళను ముఖ్యమంత్రి చేయాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని బలహీన వర్గాలకు ఇవ్వనున్నట్లు ఓ వార్త హంగామా చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది తేలనుంది.
గెలిచిన 48 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రేఖా గుప్తా. ముఖ్యమంత్రి రేసులో ఆమె ముందు వరుసలో ఉన్నారు. దీనికితోడు ఆమె బిజెపి మహిళా విభాగానికి జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా.
గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం గెలుపొందిన శిఖా రాయ్ బలమైన పోటీదారుగా ఉన్నారు. ఆమె ఆప్‌కు చెందిన సౌరభ్ భరద్వాజ్‌ను ఓడించారు. వజీర్‌పూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే పూనమ్ శర్మ, నజాఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నీలం పెహల్వాన్ ముఖ్యమంత్రుల రేసులో ఉన్నారు.
ALSO READ: మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఇదిలావుండగా మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, దివంగత సుస్మాస్వరూజ్ కూతురు బన్సూరీ స్వరాజ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. బన్సూరీ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టిన విషయం తెల్సిందే.
వీరు మాత్రమే కాకుండా ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానీ, సాహెబ్ సింగ్ వర్మ కుమారులు తమతమ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఫలితాలు వెల్లడికాగానే వీరిద్దరు హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వారి నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలీదుగానీ సైలెంట్ అయిపోయారు. ఈ లెక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తెలియాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయక తప్పదన్నమాట.