Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిహోరా వద్ద సిమెంట్ లోడ్‌తో ఉన్న భారీ ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లి.. తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రక్ మినీ బస్‌ను డీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులు నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేంద్రనగర్ వాసులుగా గుర్తించారు. మృతులు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డిలుగా గుర్తించారు. వీళ్ళు అందరూ బంధువులు కావడం.. అందరూ నాచారం ప్రాంతానికి చెందినవారు. మొత్తం మూడు బస్సుల్లో కుంభమేళాకు యాత్రికులు వెళ్లారు. ప్రమాదానికి గురైన బస్సు నెం. AP29 W 1525గా గుర్తించారు.
ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 14మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఘటన స్థలానికి జబల్‌పూర్ ఎస్పీ, కలెక్టర్ చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇదిలా ఉంటే.. సోమవారం నాడు గ్వాటెమాల రాజధాని సివార్లలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు వంతెనపై నుండి 115 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 55మంది వరకు మృతి చెందారు, బస్సు పడిన చోట బురదగా ఉండడంతో.. అందులో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
Also Read: రెండు రోజులు వెళ్లొద్దు.. కుంభమేళాలో 350 కి.మీ ట్రాఫిక్ జామ్
ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంధి బస్సు నుంచి గాయపడిన వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపడుతోంది. బస్సు రాజధానికి ఈశాన్యంగా ఉన్న ప్రోగ్రెసో నుంచి వచ్చిందని, బాధితుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవాలో ఈ ఘటన గురించి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.