Delhi fire incidents: ఢిల్లీలో రెండురోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం సాయంత్రం కరోల్ బాగ్ ప్రాంతంలోని విశాల్ మేగా మార్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు, గురువారం డిల్లీ ఎయిమ్స్ ట్రామా సెంటర్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు అంటుకున్న ఘటన కూడా కలకలం రేపింది.
కరోల్ బాగ్‌లో మెగా ఫైర్ అలా మొదలైంది..
శుక్రవారం సాయంత్రం 6:47 గంటలకు ఢిల్లీ ఫైర్ సర్వీసులకు అగ్నిప్రమాద సమాచారం అందడంతో వెంటనే స్పందించిన సిబ్బంది 13 నుంచి 15 ఫైరింజన్‌లను సంఘటనా స్థలానికి తరలించారు. కరోల్ బాగ్ వ్యాపారవర్గానికి కేంద్రంగా నిలిచే విశాల్ మెగా మార్ట్‌లో మంటలు భారీ స్థాయిలో చెలరేగడంతో క్షణాల్లోనే జనం భయంతో పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో మరో ప్రమాదం..
ఇదే సమయంలో గురువారం డిల్లీ ఎయిమ్స్ ట్రామా సెంటర్ సమీపంలోని ఎన్‌డీఎంసీ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగిన ఘటన కూడా అధికారులకు కాసింత గందరగోళాన్ని కలిగించింది. మధ్యాహ్నం 3:34కి ఈ ఘటనపై అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో ఎనిమిది ఫైరింజన్‌లను అక్కడికి తరలించారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు అనంతరం మంటలు దాదాపు 30-40 నిమిషాల్లో అదుపులోకి వచ్చాయి.
డిల్లీ ఫైర్ సర్వీసు డైరెక్టర్ అతుల్ గార్గ్ మీడియాతో మాట్లాడుతూ.. జేపీ నాట్ ట్రామా సెంటర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ప్రాంతంలో మంటలు వచ్చిన సంగతి నిజమే. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎయిమ్స్ సిబ్బంది ముందుగానే మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మా బృందం చేరిన తర్వాత మిగతా చర్యలు చేపట్టామని తెలిపారు.
Also Read: 15 Carat Diamond Kurnool: కర్నూలులో దొరికిన భారీ వజ్రం.. లక్ అంటే ఈమెదే!
ఎయిమ్స్ అధికారిక ప్రకటన
ఈ ఘటనపై ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) స్పష్టత ఇచ్చింది. JPNATC (ట్రామా సెంటర్)లో మంటరేగిందన్న వార్తలు అపోహ మాత్రమే. నిజానికి ట్రామా సెంటర్ క్యాంపస్‌లోని NDMC ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చిన్నస్థాయిలో మంటలు చెలరేగాయి. అదీ పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఎలాంటి ప్రాణనష్టం లేదు. ఆసుపత్రి కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని అధికారికంగా వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ రెండు ఘటనలతో సంబంధం లేకపోయినప్పటికీ, రెండు రోజుల వ్యవధిలో ఢిల్లీలో భారీ మంటలు చెలరేగడంతో ప్రజల్లో భయం నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ పరికరాలు, శీతలీకరణ యంత్రాల వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది. ఫెస్టివల్ సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో పెద్ద షాపింగ్ మాల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన సమయం ఇది.
ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే కోట్లాది ఆస్తులను బూడిద చేస్తాయి. కరోల్ బాగ్ మెగా మార్ట్ ఘటన ఇది మరోసారి నిరూపించింది. మరోవైపు ఎయిమ్స్ వద్ద జరిగిన ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు ఆందోళన కలిగించినా, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశం. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాల నివారణకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.