Indira Gandhi Gold Statement: దేశ ప్రజలను ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మెుదలైంది. ఈ క్రమంలోనే ఓ పేపర్ క్లిప్ సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం.. భారతీయులను బంగారం కొనవద్దని కోరినట్లుగా ఉన్న ఫొటో ఒకటి ట్రెండింగ్ అవుతోంది. అయితే ఇందులో నిజానిజాలేంటి? ఇప్పుడు చూద్దాం.
1967 జూన్ 6 నాటి ‘ది హిందూ’ (The Hindu) పత్రికా క్లిప్పింగ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ‘బంగారం కొనకండి.. ప్రజలకు ఇందిర పిలుపు. జాతీయ క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తి’ (Don’t buy gold, Indira tells people; appeals for ‘national discipline’) అనే హెడ్ లైన్ కనిపిస్తోంది. దీంతో ప్రధాని మోదీ తరహాలోనే గతంలోనూ ఇందిరా పిలుపునిచ్చారని చాలా మంది చర్చించుకుంటున్నారు.
The first one is a digitally altered page being wrongly presented as the front page of The Hindu on June 6, 1967. The second is the actual page released that day. This is what social media is capable of; it can even alter the front page of India's national English daily. pic.twitter.com/GZ4CHtu90s
— B. Kolappan (@kolappan) May 12, 2026
అయితే వైరల్ అవుతున్న పేపర్ క్లిప్ అసలైందని కాదాని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు ధ్రువీకరించారు. అది డిజిటల్ పద్దతిలో ఎడిట్ చేసినదిగా తేల్చేశారు. అసలు జూన్ 6, 1967 నాటి ‘ది హిందూ’ పత్రిక మొదటి పేజీలో ఇలాంటి వార్త ఏదీ రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వార్త వైరల్ కావడంతో ‘ది హిందూ’ యాజమాన్యం సైతం స్పందించింది. తమ పత్రిక పేరుతో చలామణి అవుతున్న ఆ క్లిప్పింగ్ నకిలీదని, తమ ఆర్కైవ్స్‌లో అలాంటి వార్త లేదని అధికారికంగా స్పష్టం చేసింది.
ప్రధాని మోదీ మే 10వ తేదీన హైదరాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు అనవసరంగా బంగారం కొనవద్దని, వివాహాల వంటి సందర్భాల్లోనూ నియంత్రణ పాటించాలని కోరారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. గతంలో ఇందిరా గాంధీ కూడా ఇలాగే అన్నారని చూపేందుకు నకిలీ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే రెండో విడత స్టార్ట్.. మంత్రి పొంగులేటి ప్రకటన
గోల్డ్ కొనుగోలు చేయవద్దని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. దానిని నియంత్రించే చట్టాన్ని మాత్రం ఆమె తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 1968లో ‘గోల్డ్ కంట్రోల్ యాక్ట్’ (Gold Control Act) ను ఆమె అమల్లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రజలు బంగారు కడ్డీలు, నాణేల రూపంలో బంగారం ఉంచుకోవడాన్ని నిషేధించారు. కేవలం ఆభరణాల రూపంలో మాత్రమే పరిమిత పరిమాణంలో బంగారం ఉంచుకోవడానికి ఆమె అనుమతి ఇచ్చారు. అయితే ఈ చట్టాన్ని 1990లో రద్దు చేశారు.
Also Read: ప్రజలను విభజించే.. సనాతనాన్ని నిర్మూలించాలి.. ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు