
Diwali in Assam : స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ‘స్వచ్ఛ దీపావళి – శుభ దీపావళి’ ప్రచారం ఊపందుకుంటోంది. కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఈ పండుగను పర్యావరణహితంగా జరుపుకునే దిశగా అడుగులు పడ్డాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
రంగోలి కోసం ఎకో-ఫ్రెండ్లీ రంగులు, ఇళ్ల అలంకరణలో పాత చీరలు-దుపట్టాల వినియోగం ఆ కోవలోకే వస్తాయి. ఇక మట్టి, టెర్రాకోటా, జూట్, వెదురుతో చేసిన ప్రమిదల వాడకమూ పెరిగింది. వాడిన తర్వాత ఎరువుగా ఉపయోగపడే ఎకో-ఫ్రెండ్లీ దివ్వెలను మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ పదేళ్లుగా ఉచితంగా పంపిణీ చేస్తోంది.
అసోంలో దీపావళి సంబరాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అరటి చెట్లపై దివ్వెలను వెలిగించడం అక్కడ ఆనవాయితీ. ఇందుకోసం అరటి చెట్టును నరికి, ఇంటిముందు పాతి, అందులో చిన్న చిన్న వెదురు ముక్కలను గుచ్చి.. వాటిపై దివ్వెలను వెలిగిస్తారు.
రకరకాల ఆకృతుల్లో అరటి చెట్టుపై దివ్వెలను పేరుస్తారు. ఇంటికి ఎంతో శోభనిచ్చినా.. అది పండుగ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మరుసటి నాడు వీధుల నిండా ఆ నరికిపారేసిన అరటి చెట్లే కనిపిస్తాయి. ప్రజలు కాల్చే బాణసంచాకు ఇవి అదనం. అందుకే ప్రభుత్వమే స్వయంగా ఆ అరటిచెట్లను సేకరించే కార్యక్రమానికి పూనుకుంది.
అసోం స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్(SBM-U) ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీపావళి రోజున దీపస్తంభాలుగా ఇంటింటి ముందు పాతిన ఆ నరికిన అరటిచెట్లను వీధుల నుంచి సేకరించి, వాటిని జూలోని జంతువులకు ఆహారంగా అందిస్తారు. ఏనుగులు, పందులు, ఎలుగుబంట్లు, పశువులు, కొన్ని వానరాలు వాటిని ఆహారంగా తీసుకుంటాయి.
తమకు సమీపంలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పార్కులకు ఆ అరటి చెట్లను తరలించే బాధ్యతను అసోం ప్రభుత్వం స్థానిక సంస్థలకు అప్పగించింది. ఒకవేళ అవి అందుబాటులో లేని పక్షంలో అరటి చెట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కంపోస్ట్ కేంద్రాలకు తరలిస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని మునిసిపాలిటీల పరిధిలో 104 సెంట్రల్ కంపోస్ట్ పిట్లు పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా మరో 6,245 పిట్లను ప్రజలు తమ ఇళ్లల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి చోట్లకు కూడా అరటి చెట్ల వ్యర్థాలను అధికారులు తరలించనున్నారు.
దీపావళి సమయంలో అసోం అంతటా అరటి చెట్లను విపరీతంగా నరికేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అరటి చెట్లు ఇళ్లల్లోనే పెంచుకుంటారు. ఇటీవలి కాలంలో అక్కడ వాటిని పెంచేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఇక.. పట్టణాల్లో, నగరాల్లో అరటి చెట్ల పెంపకమనేది దాదాపు కనిపించదు.
దీంతో పండుగ రోజు అరటి చెట్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో చెట్టుకు రూ.300 నుంచి రూ.500 వరకు వెచ్చిస్తుంటారు. డిమాండ్ పెరిగేకొద్దీ ఈ ధర మరింత పెరుగుతుంది. ఇంతా చేసి రైతులకు దక్కేది రూ.50 నుంచి రూ.100 మాత్రమే. డిమాండ్ కారణంగా కొన్నిసార్లు అటవీ ప్రాంతాల నుంచి కూడా అరటిచెట్లను నరికి తీసుకొస్తుంటారు.
.
.
.
Railway Minister : ప్యాసింజర్ రైళ్ల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ : రావ్ సాహెబ్ దన్వే