BigTV English

E20 Petrol: తగ్గుతున్న మైలేజ్.. E20 పెట్రోల్‌పై అనుమానాలు

E20 Petrol: తగ్గుతున్న మైలేజ్.. E20 పెట్రోల్‌పై అనుమానాలు

E20 Petrol: ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో మైలేజ్ పడిపోతోందని, 2023 కంటే ముందు కొన్న వాహన ఇంజిన్లకు డేంజర్ అన్నది హాట్ డిబేట్ గా మారింది. ఒకవైపు E20 పెట్రోల్ పై చర్చ జరుగుతుండగానే.. డీజిల్ లో ఐసోబ్యూటనాల్ కలిపేందుకు రెడీ అన్న సిగ్నల్స్ ను గడ్కరీ ఇవ్వడంతో ఫ్యూయల్ చుట్టూ మైలేజ్ గేమ్ పెరుగుతోంది. ఇంతకీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో లాభమా నష్టమా?


చర్చనీయాంశంగా మారిన E-20 పెట్రోల్ మ్యాటర్

మీరు పెట్రోల్ బంక్ కు వెళ్లి బండిలో పెట్రోల్ పోయించాక.. ఒక సమస్య నోటీస్ చేశారా? ఎంత పెట్రోల్ పోసినా మైలేజ్ రావట్లేదన్న విషయాన్ని గుర్తు పట్టారా..? అయితే మీ బండి 2023 కంటే ముందు కొన్నట్లైతే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మ్యాటర్ ఏంటంటే E-20 పెట్రోల్ గురించే. దీంతో బండ్లన్నీ చెడిపోతున్నాయని, మైలేజ్ బాగా తగ్గిందని, ఎంత పెట్రోల్ కొట్టించినా మళ్లీ మళ్లీ పెట్రోల్ బంక్ కు వెళ్లాల్సి వస్తుండడం ఇవన్నీ కామన్ అవుతున్నాయని సోషల్ మీడియాలో పెద్ద దుమారమే నడుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశంలో E 20 పెట్రోల్ అంటే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్ముతున్నారు. ఏ బంక్ దగ్గరైనా.. మీరు ఫిల్ చేయించుకుంటున్నది E 20 పెట్రోల్ అని పెద్ద ఎత్తున బోర్డులు, ప్రచారం చూశారా? లేదు.. జస్ట్ వందో, ఐదు వందలో ఇచ్చామా.. పెట్రోల్ కొట్టించుకున్నామా అన్నదే జనం చూస్తున్నారు. కానీ వెహికిల్ డ్యామేజ్ ను ఎవరు పట్టించుకోవాలి? నష్టం ఎవరు ఇవ్వాలన్న విషయం చుట్టూ ఇప్పుడు చర్చ పెరిగింది.


E 20 పెట్రోల్‌తో 30% తగ్గే కర్బన ఉద్గారాలు

మొదటగా E 20 పెట్రోల్ తో కలిగే లాభాలేంటో చూద్దాం. వాహన కాలుష్యం తగ్గుతుంది. అంటే కార్బన్ ఎమిషన్స్ 30% వరకు తగ్గుతాయంటున్నారు. ఇథనాల్ బయో-బేస్డ్ ఫ్యూయల్ కావటంతో, శిలాజ ఇంధనాలు అంటే పెట్రోల్ కంటే గ్రీన్‌హౌస్ గ్యాసెస్ తక్కువ రిలీజ్ అవుతాయి. 2014 నుంచి ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ తో 763 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ తగ్గిందంటోంది కేంద్రం. ఇది 30 కోట్ల చెట్లను నాటడానికి సమానమంటున్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్‌తో, ఈ ఏడాది రైతులకు చెల్లించింది 40 వేల కోట్లు ఉంటుందని లెక్కలు వేశారు. అలాగే 2014-15 నుంచి 2024-25 వరకు గత పదకొండేళ్లలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల చమురు కంపెనీలకు 1,44,087 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందంటున్నారు. చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గితే భారత్ స్వయం సమృద్ధివైపు వెళ్తుందంటున్నారు. 245 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గించుకున్నామంటున్నారు.

2025లో 10 బిలియన్ లీటర్ల ఇథనాల్ డిమాండ్

రైట్ హైయర్ ఆక్టేన్ రేటింగ్ తో ఇంజిన్ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుందని, బెటర్ ఆక్సిలరేషన్, స్మూత్ రైడ్ ఉంటుందని చెబుతున్నారు. ఇది 2023 తర్వాత కొన్న వాహనాలకైతే వర్తిస్తుంది. చెరుకు, మక్క, వరి ఇలా ఇథనాల్ తయారీలో వాడే పంటలు పండించే రైతుల ఆదాయం పెరుగుతుంది. 2025లో 10 బిలియన్ లీటర్ల ఇథనాల్ డిమాండ్ తో ఈ రంగంలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయంటున్నారు. E20 పెట్రోల్ తో వాహనాల్లో సమస్య వస్తే ఇన్సూరెన్స్ పాలసీలపైనా ప్రభావం లేదని కేంద్రం క్లారిటీ ఇస్తోంది. అయితే ఇందులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. మాటల్లో చెప్పినంత ఈజీ కాదు.. వెహికిల్ ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకోవడం. ఎందుకంటే వెహికిల్ మాన్యువల్ లో ఒకటి ఉంటుంది. ఇక్కడ వాహనానికి సమస్య మరొకటి వస్తుంది. మ్యాచ్ కాదు. ఫైనల్ గా చేతులెత్తేసే కార్యక్రమమే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

2025 నుంచి 20 శాతం ఇథనాల్ రోల్ అవుట్

నిజానికి పెట్రోల్ లో ఇథనాల్ బాగా కలిసిపోతుంది. పెట్రోల్ ను పవర్ ఫుల్ గా మండేలా చేస్తుంది. నిజానికి దేశంలో ఎప్పటి నుంచో పెట్రోల్ లో ఇథనాల్ కలుపుతూ వస్తున్నారు. 2030 నాటికి 20 శాతం కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీన్ని హఠాత్తుగా ప్రీపోన్ చేసి 2025 మార్చి నుంచి దేశంలో రోల్ అవుట్ చేశారు. జనం నుంచి అభిప్రాయాలు తీసుకోలేదు. ఇక్కడే సమస్య వస్తోంది. ఎందుకంటే 2023 తర్వాత తయారైన వాహనాలకే E-20 పెట్రోల్ పై సమర్థంగా పని చేసే వెసులుబాటు ఉంది. అంతకు ముందు వాహనాలకు ఈ కెపాసిటీ లేదు. ఎందుకంటే 20 శాతం కలిసిన ఇథనాల్ తో ఇంజిన్ ఫ్యూయెల్ సిస్టమ్ లో సమస్యలు వస్తాయి. ఎక్కువ రోజులు వాహనం తీయకపోతే పెట్రోల్, ఇథనాల్ మధ్య కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. అవి ఫ్యూయెల్ పైప్ లైన్ లో పేరుకుపోయి డ్యామేజ్ పెంచుతుంది. ఫ్యూయెల్ పార్ట్స్ అన్నీ తుప్పు పడుతాయి. ఇంధనం సరిగా మండకపోవడం, మైలేజ్ తగ్గడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఒకవైపు ఈ 20 పెట్రోల్ చుట్టూ దుమారం పెరుగుతుండగానే కేంద్రమంత్రి గడ్కరీ నుంచి మరో స్టేట్ మెంట్ వచ్చింది. నెక్ట్స్ డీజిల్ బండ్లే లైనప్ లో ఉన్నాయి.

జెట్ ఫ్యూయల్‌లోనూ ఇథనాల్ కలుపుతాం: గడ్కరీ

పెట్రోల్‌లో ఇథనాల్‌ మాదిరే.. డీజిల్‌లో ఐసో బ్యూటనాల్‌ను కలిపే ప్రక్రియను స్పీడప్ చేస్తామంటున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. అంతే కాదు త్వరలో విమాన ఇంధనంలోనూ ఇథనాల్‌ కలుపుతామంటున్నారు. E-20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ తనను రాజకీయంగా టార్గెట్ చేసుకున్నవే అని సెప్టెంబర్ 11న ఢిల్లీలో జరిగిన SIAM సదస్సులో ఫైర్ అయ్యారు. నిజానికి E-20 పెట్రోల్ అంటే చాలా వరకు వ్యక్తిగత వాహనదారులే ఉంటారు. ఇక డీజిల్ వెహికిల్స్ అంటే ట్రాన్స్ పోర్ట్ వి ఉంటాయి. రవాణా వాహనాలకు వ్యాపారాలు, వెహికిల్ ఓనర్లకు చాలా లింకప్ ఉంటుంది. మైలేజ్ విషయాలు, బండి ఇంజిన్ పై ఎఫెక్ట్ చూపడం అంటే కథ మరోలా ఉంటుంది.

మోసం చేసి సంపాదించే కర్మ పట్టలేదు: గడ్కరీ

సెప్టెంబర్ 14న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు నెలకు 200కోట్ల ఆదాయం వస్తుందని, ఎవర్ని మోసం చేసి సంపాదించాల్సి కర్మ పట్టలేదన్నారు. డబ్బుకు కొదవలేదని, షుగర్ ఫ్యాక్టరీలు, డిస్టిల్లరీ, పవర్ ప్లాంట్ వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఇవన్నీ వ్యక్తిగత లాభం కోసం కాకుండా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చేస్తున్నానని చెప్పుకున్నారు. సుప్రీంకోర్టు కూడా E-20 పెట్రోల్ పై దాఖలైన పిల్ ను తిరస్కరించిందని గుర్తు చేస్తున్నారు. నిజానికి వెహికిల్ మైలేజ్ తగ్గడానికి E-20 పెట్రోల్ ఒక్కటే కారణం కాదని, చాలా కారణాలు ఉంటాయని కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. డ్రైవింగ్ హ్యాబిట్స్, పెట్రోల్ మార్పులు, ఎయిర్ ఫిల్టర్, మెయింటెనెన్స్, టైర్ ప్రెజర్, వీల్ అలైన్‌మెంట్ ఏసీ లోడింగ్ ఇవన్నీ ఉంటాయంటోంది కేంద్రం. అదీ సంగతి. మరి E-20 పెట్రోల్ తో అన్నీ లాభాలే ఉన్నాయా.. నష్టాలు లేవా.. అంటే ఉన్నాయంటున్నారు వాహనదారులు. తమకు ఎదురవుతున్న సమస్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. E-10 నుంచి E-20కి మూడేళ్లలోనే స్పీడ్ గా ఎందుకు అప్ గ్రేడ్ చేశారని క్వశ్చన్ చేస్తున్నారు. మీ పాత కారును E-20 కంపాటిబుల్ చేయాలంటే ఎంత ఖర్చవుతుంది?

పాత వాహనాల్లో పర్ఫార్మెన్స్ తగ్గే ప్రమాదం

E-20 పెట్రోల్ తో వాహనాల మైలేజ్ పై కొంత వరకే ఎఫెక్ట్ ఉంటుందని కేంద్రమే అంగీకరించింది. అందరూ అనుకున్నట్లు భారీగా ఉండదంటున్నారు. మైలేజ్ 1 నుంచి 6% తగ్గుతుంది ఆటోమొబైల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఫోర్ వీలర్లలో 1-2%, టూ వీలర్లలో 3-6శాతం అంటున్నారు. పాత వాహనాలు అంటే 2023 కంటే ముందు మోడల్స్ లో ఇంజిన్ డ్యామేజ్, తుప్పుపట్టడం, రబ్బర్/ప్లాస్టిక్ పార్ట్స్ పాడవడం, ఫ్యూయెల్ పైప్ లైన్ లో డ్యామేజెస్ తో పర్ఫార్మెన్స్ తగ్గి, మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుందన్న వాదన పెరుగుతోంది. సరే పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలిపారు. అయితే పెట్రోల్ కంటే ఎక్కువగా ఇథనాల్ తయారీకే ఖర్చవుతోంది. ఇదో సర్ ప్రైజింగ్ ఫ్యాక్టర్. దీంతో E-20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చినా వినియోగదారులకు పెట్రోల్ రేట్లు ఎక్కడా తగ్గలేదు. గతంలో E-20 అమలులోకి వస్తే పెట్రోల్ రేట్లు తగ్గుతాయన్న వెర్షన్ ను కేంద్రం వినిపించింది. కానీ ఇప్పుడు ఆ సౌండ్ లేదంటున్నారు. పైగా మైలేజ్ డ్రాప్ వల్ల అదనపు ఫ్యూయల్ కాస్ట్ జనం జేబులకే చిల్లు పెడుతోంది.

1 లీటర్ ఇథనాల్‌కు 2,500-2,860 లీటర్ల నీళ్లు

ఇథనాల్ ప్రొడక్షన్‌ లో 1 లీటర్ ఇథనాల్‌కు 2,500-2,860 లీటర్ల నీళ్లు అవసరం అవుతున్నాయి. సాధారణంగా ఇథనాల్ ఫ్యాక్టరీలో నీటి వనరులు ఉన్న చోటే ఏర్పాటవుతున్నాయి. మన దగ్గర చాలా చోట్ల ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలతో గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా దిలవార్ పూర్ లాంటి చోట సంఘర్షణ తీవ్రంగా జరిగింది. చెరుకు, మొక్కజొన్న, వరి లాంటివి ఇథనాల్ తయారీకి డైవర్ట్ అవడం వల్ల పశువులకు మేత, ఫుడ్ సెక్యూరిటీకి ఎఫెక్ట్ అన్న వాదన కూడా పెరుగుతోంది. నిజానికి 2023 ముందు కొన్న వాహనాలకు బంకుల్లో E-10 పెట్రోల్ సెపరేట్ గా ఫిల్లింగ్ పాయింట్లు పెట్టి ఉంటే బాగుండేదన్న సూచనలు వస్తున్నాయి. తమ వాహనాల లైఫ్ ను మరిన్ని రోజులు పొడగించుకునే అవకాశం ఉండేదంటున్నారు. కానీ ఇప్పుడు ఫోర్స్ ఫుల్ గా అన్ని వాహనాల్లో దీన్ని ప్రవేశపెట్టడంతో కథ మారుతోందన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

మైలేజీ విషయాలను షేర్ చేస్తున్న వాహనదారులు

E-20 పెట్రోల్ తో పాత వాహనాల్లో ఇంజిన్లకు ఫ్యూయెల్ సప్లై చేసే పార్ట్స్ ను దెబ్బతీస్తుందన్నది ప్రధాన ఆందోళనగా ఉంది. చాలా మంది వాహనదారులకు తాము కొనుగోలు చేస్తున్న పెట్రోల్‌లో ఎంత ఇథనాల్ ఉందో తెలియదు. E20 పెట్రోల్ పై వస్తున్న ఆరోపణలు నిరాధారమంటోంది కేంద్రం. కొత్త కార్లలో మైలేజ్ 1% నుంచి 2% వరకు పాత కార్లలో 6% వరకు తగ్గవచ్చంటోంది. అయితే దీన్ని పర్ ఫెక్ట్ సర్వీసింగ్, మెయింటెనెన్స్ తో జాగ్రత్తలు తీసుకోవచ్చనడంతో కొందరు వెహికిల్ ఓనర్స్.. రియాక్టై.. తమ మైలేజీ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభుత్వం నిజాలను దాస్తోందన్నారు. తాను E20 కంపాటబుల్ కారును రెండు నెలల పాటు పరీక్షించానని, మైలేజ్ 5 నుంచి 6% మధ్య తగ్గిందని సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. ఒక్కసారి ఈ వోక్స్ వాగన్ కారు ఓనర్ షేర్ చేసింది మీరూ చూడండి.

E- 20 అప్ గ్రేడ్‌కిట్‌కు రూ.6 వేల దాకా ఖర్చు

అందుకే ఈ సబ్జెక్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. E-20 పెట్రోల్ తో ఇంజిన్ చెడిపోతే ఇన్సూరెన్స్ కష్టమని, జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు వచ్చాయి. కొన్ని కార్ కంపెనీలు కూడా E-20 కేర్ ఫుల్ అని చెప్పి ఆ తర్వాత స్టేట్ మెంట్ ఉపసంహరించుకున్నాయి. కేంద్రం ఒత్తిళ్లే కారణం అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఏ వాహనం కొన్నా వాటికి మాన్యువల్ బుక్ వస్తుంది. అందులో మీ వాహనానికి ఏ ఫ్యూయెల్ అవసరమో అందులో చెబుతుంటారు. మరిప్పుడు E-20తో జరిగే నష్టానికి బాధ్యులు ఎవరన్న ప్రశ్న వస్తోంది. ముఖ్యంగా ఈ E- 20 పెట్రోల్ తో ఫ్యూయెల్ పైప్, ఫ్యూయెల్ ట్యాంక్, చాలా మార్చాలి. దీన్ని E- 20 అప్ గ్రేడ్ కిట్ అంటారు. fథనాల్-రెసిస్టెంట్ మెటీరియల్స్‌తో కూడిన సెట్ ఇది. ఫ్యూయల్ సిస్టమ్‌ను రక్షిస్తుంది. ఇథనాల్ తో కెమికల్ రియాక్ట్ కాని ఫ్యూయెల్ పార్ట్స్ అన్నీ మార్చాలి. అంటే చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్లుగా తడిసి మోపడవుతుందన్న మాట. కాంపోనెంట్స్ కు ఆరు వేలు దాకా ఖర్చవుతుందనుకుంటే.. ఇంకా వేయాల్సినవన్నీ వేసి మెకానిక్ ఛార్జీలు అన్నీ కలిపితే ఫోర్ వీలర్ కు 35 వేల రూపాయల దాకా ఖర్చు అవుతుందన్న అంచనాలైతే ఉన్నాయి. వెహికిల్ ను E-20కి తగ్గట్లు ఫుల్ కన్వర్ట్ చేయాలంటే ఇంకింత తడిసి మోపడవుతుంది.

Also Read: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

బ్రెజిల్ 1970ల నుంచే ఇథనాల్ బ్లెండింగ్ పై వర్కవుట్ చేస్తూ వచ్చింది. ప్రజలకు సమయం ఇచ్చింది. కానీ మన దగ్గర 2014లో 1.5 ఇథనాల్ పెట్రోల్ లో మిక్సింగ్ ఉంటే.. 2022 నాటికి 10 శాతానికి తీసుకొచ్చారు. ఈ మూడేళ్లలోనే దాన్ని 20 శాతానికి చేర్చారు. 2030 టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఐదేళ్ల ముందుగానే కథ మార్చారు. మరిప్పుడు పాత వాహనాల పరిస్థితి ఏమిటి? డీజిల్ లో ఐసో బ్యుటనాల్ కలిపితే పాత డీజిల్ వాహనాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అన్నీ స్క్రాప్ కు తరలించాల్సిందేనా అన్నది చర్చనీయాంశంగా మారాయి.

Story By Vidya Sagar, Bigtv

Related News

Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. రెడ్ అలర్ట్ జారీ

CBSE Board Exams: టెన్త్‌, ఇంట‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్.. 75 శాతం హాజ‌రు కావాల్సిందే

AI Content Creators: AI కంటెంట్‌ క్రియేటర్లకు చెక్.. కేంద్రం సంచలన నిర్ణయం

Rajini – Vijay: రజినీ వర్సెస్ విజయ్.. పొలిటికల్ ఫ్యాన్ వార్

Supreme Court: వక్ఫ్‌ చట్టం-2025.. సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు, ఓ ప్రొవిజిన్‌ నిలిపివేత

Jharkhand: జార్ఖండ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఓ అగ్రనేత సహా ఇద్దరు కమాండర్లు హతం

Mumbai Metro: ట్రాక్‌పైనే నిలిచిపోయిన మెట్రో.. ప్రయాణికుల్లో భయాందోళన!

Big Stories

×