Exit polls : హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్ మీడియాలో ప్రచురించ వద్దని, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రసారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 126(1)(బీ)ప్రకారం ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు మీడియాలో ప్రసారం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తమ ఆదేశాలను అమల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారులకు నిర్దేశించింది. మీడియా సంస్థలకు సమాచారం పంపాలని ఆదేశించింది.