
Electric Vehicles Charging : కేంద్ర ప్రభుత్వం 68 నగరాల్లో కొత్తగా 2,877 ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) చార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 1,845 స్టేషన్లు ఢిల్లీలో ఏర్పాటయ్యాయి.
మహారాష్ట్రలో 660, తమిళనాడు 441, ఉత్తరప్రదేశ్‌లో 406 చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పారు. తెలంగాణలో 365 స్టేషన్లు, ఏపీలో 222, హరియాణాలో 232 చార్జింగ్ స్టేషన్లను నిర్మించారు. జాతీయ రహదారులపై 419 ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. 2030 నాటికి ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యోచన.
ప్రముఖ సంప్రదాయ కార్ల సంస్థలు ఫోర్డ్, జనరల్ మోటార్స్, మెర్సిడెస్ కూడా ఈవీ రంగంలోకి అడుగిడాయి. అమెరికా, ఇతర దేశాల్లో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ ఈవీ కార్ల రంగంలో విప్లవాన్నే సృష్టించింది. టూ-వీలర్, త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం దేశంలో ఎక్కువగానే ఉంది.
5,44,643 టూ వీలర్ ఈవీలు ఉండగా..త్రీ వీలర్ ఈవీలు 7,93,370 వరకు అమ్ముడుపోయాయి. ఈవీ కార్ల విషయంలో పెద్దగా ఊపేమీ కనిపించడం లేదు. ప్రస్తుతం 54,252 ఈవీ కార్లు మాత్రమే రోడ్లపై పరుగులు తీస్తున్నాయి.