Father Kill NEET Daughter| పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్లు తమ జీవితాల్లో విజయాలు సాధించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం వారిని క్రమశిక్షణలో పెంచుతారు. అవసరమైతే కఠిన వైఖరితో వ్యవహరిస్తారు. ఇది సాధారణమే. కానీ వృత్తి రీత్యా టీచర్ అయిన తండ్రి తన కూతురు ఒక పరీక్షలో తక్కువ మార్కులు స్కోర్ చేసిందని ఆగ్రహం చెందాడు. పరీక్షల సమయంలో నిర్లక్ష్యం ఎందుకు చేసావ్? అని నిలదీసాడు. అందుకు ఆమె చెప్పిన రెచ్చగొట్టే మాటలకు పట్టరాని కోపంతో రాత్రంతా ఆమెను చితక బాదాడు. గదిలో బంధించేశాడు. ఫలితంగా ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి ఆమె చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర సాంగ్లీ జిల్ల నెల్ కరెంజీ గ్రామంలో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్న ఢోండిరాం భోంస్లే కు సాధన భోంస్లే అనే 17 ఏళ్ల కూతురు ఉంది. ఆమె ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. పదో తరగతిలో 90.52 శాతం మార్కుల ఉత్తమ స్కోర్ సాధించిన సాధన డాక్టర్ కావాలని ఆమె తండ్రి శిక్షణ ఇస్తున్నాడు. అందుకు తగ్గట్లుగా ఆమె కు వైద్య విద్య కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష అయిన నీట్ లో మంచి స్కోర్ సాధించాని కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాడు. అయితే ఇటీవల నీట్ పరీక్షకు మాక్ టెస్ట్ లలో సాధన చాలా తక్కువ స్కోర్ చేసింది.
ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఇంట్లో ఢోండిరాం తన కూతురిని ఇంత తక్కువ మార్కులు ఎలా వచ్చాయని? చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కుదరదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ తండ్రి కోపాన్ని అర్థం చేసుకోకుండా సాధన ఆయన తప్పులు ఎత్తి చూపింది. బాగా చదువుకుని తాను కలెక్టర్ ఎందుకు కాలేదని? కేవలం ఒక హెడ్ మాస్టర్ గానే ఎందుకు ఉండిపోయాడని ఎదరు ప్రశ్నించింది? .. సాధన మాట్లలకు పట్టరాని కోపంతో ఢోండిరాం ఒక కర్రతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. అయినా సాధన తన తండ్రికి ఎదురు మాట్లాడడంతో వివేకం కోల్పోయిన ఢోండీరాం ఆమెను రాత్రంతా గదిలో పెట్టి చితకబాదుతూనే ఉన్నాడు.
Also Read: ఇన్‌స్టెంట్ కాఫీ తాగడం ప్రమాదకరం.. రోజూ తాగితే ఆరోగ్య సమస్యలు
ఉదయం ఆమెను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. తాను మాత్రం యోగా కార్యక్రమానికి అతిథిగా వెళ్లిపోయాడు. సాధన పరిస్థితి విషమించడం చూసి ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే ఆస్పత్రిలో సాధన చికిత్స ప్రారంభించకముందే ప్రాణాలు వదిలింది. సాధన చనిపోవడంతో ఆమె తల్లి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హెడ్ మాస్టర్ ఢోండిరాంను అరెస్టు చేయగా.. ఆయన తన నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సాధన మృతదేహం పోస్ట్ మార్టం కోసం తరలించగా.. ఆమె గాయాల కారణంగా మరిణించిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది.