మనం చూసేదంతా డిజిటల్ ప్రపంచం. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేషన్. ఈ రెండిట్నీ సమర్థంగా ఉపయోగించుకుంటే అన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నాయి. రవాణా రంగంలో కూడా టెక్నాలజీని ఉపయోగించి ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు, నిబంధనలు ఉల్లంఘించేవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఢిల్లీ, గురుగ్రామ్ ని కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేలో ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను (ATMS)ని అందుబాటులోకి తెచ్చారు. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ప్రణాళిక ఉంది. ఈ పద్ధతి ద్వారా నేషనల్ హైవేలపై ప్రమాదాల సంఖ్య నివారించవచ్చని, అదే సమయంలో నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారికి ఆటోమేటిక్ గా చలానాలు విధించవచ్చని అంటున్నారు అధికారులు.
నిఘా నీడలో..
ట్రాఫిక్ పోలీస్ కనపడితే డిక్కీలో ఉన్న హెల్మెట్ తీసి పెట్టుకుంటాం. ట్రాఫిక్ చలాన్లు రాస్తున్నారు అంటే అటువైపు వెళ్లడమే మానేస్తాం. కానీ ఇకపై ఇలాంటి చెకింగ్ లు ఉండకుండానే చలాన్లు పడిపోతాయి. నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, సీసీ కెమెరాలు ఉన్నచోట ఇలాంటి పద్ధతి ఇప్పటికే అమలులో ఉంది. అయితే దీన్ని జాతీయ రహదారులకు కూడా అన్వయిస్తూ, మరింత ఆధునీకరిస్తున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్గదర్శకాలు రూపొందించగా.. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను (ATMS)ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కారులో సీటుబెల్టె పెట్టుకోకుండా ప్రయాణించినా, బైక్ లలో ట్రిపుల్ రైడింగ్ చేసినా, పరిమితికి మించి వేగంతో వెళ్లినా ఈ సిస్టమ్ ఇట్టే పట్టేస్తుంది. 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను కనిపెట్టేలా దీన్ని రూపొందించారు. ఈ వ్యవస్థకు NIC ఇ-చలాన్ పోర్టల్ తో అనుసంధానం ఉంటుంది. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి వెంటనే పోలీసు అధికారులకు సమాచారం చేరవేసి, చలాన్లు విధిస్తారు.
కిలోమీటర్ కి ఒక కెమెరా..
ATMS అందుబాటులో ఉన్న రహదారులపై కిలోమీటర్ కి ఒకటి చొప్పున హై రిజల్యూషన్ కెమెరాలు అమర్చుతారు. 24గంటలు ఇవి పనిచేస్తాయి. కేవలం కెమెరాలతో నిఘా మాత్రమే కాదు, ఇందులో మొత్తం 5 రకాల వ్యవస్థలు ఉంటాయి. ట్రాఫిక్ మానిటరింగ్, యాక్సిడెంట్ ల వీడియోల చిత్రీకరణ, వాహన వేగం నిర్థారణ, సైన్ బోర్డుల నిర్వహణ, సెంట్రల్ కంట్రోల్ రూమ్ వంటివి ఇందులో ఇమిడి ఉంటాయి. కమాండ్ సెంటర్ అనేది ఈ వ్యవస్థ మొత్తానికి కీ పాయింట్. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక, జాతీయ రహదారి సిబ్బందికి ఆ సమాచారం వెళ్తుంది. పొగమంచు ద్వారా రోడ్డు కనపడకపోవడం, ఇతరత్రా ఇబ్బందులు, హైవేలపైకి జంతువులు రావడం వంటి విషయాల్ని కూడా వెంటనే సిబ్బందికి చేరవేసి అప్రమత్తం చేస్తుంది.
ప్రస్తుతం ఈ వ్యవస్థను ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే పై అందుబాటులోకి తెచ్చారు. నేషనల్ హైవే-48 లో 28 కిలోమీటర్ల మేర ఈ నిఘా వ్యవస్థ ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు మన దేశంలో 56.46 కిలోమీటర్ల మేర ATMS నిఘా ఉంది. దేశంలోనే ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవే ఇది. త్వరలోనే దీన్ని అన్ని రహదారులకు వర్తింపజేస్తారు.