Kakinada News: ఏపీలో అధికారుల తీరు మారడం లేదా? ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్తేనే దృష్టి పెడుతున్నారా? కాకినాడ బాలిక మిస్సింగ్ వ్యవహారమే ఇందుకు కారణమా? అధికారులు సహకరించాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం స్వయంగా చెప్పినా ఎందుకు సహకరించలేదు? వైసీపీ పాలన నుంచి అధికారులు బయటకు రావడం లేదా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
రెండురోజుల కిందట తూర్పుగోదావరి జిల్లాలో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమండ్రి వచ్చారు. ఎయిర్‌పోర్టులో ఆయన దిగి బయటకు రాగానే ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత సభలో ప్లకార్డులు పవన్ దృష్టికి వెళ్లాయి. తమకు సాయం చేయాలన్నది ఆ ప్లకార్డుల ప్రధాన ఉద్దేశం.
పవన్ అన్నా మా బిడ్డ కనిపించడం లేదు, 20 రోజులవుతున్నా మాకు న్యాయం జరగలేదు, సాయం చేయాలంటూ ఓ తల్లిదండ్రుల ఆవేదన. ఈ వ్యవహారం పవన్ దృష్టికి వెళ్లడంతో కాస్త సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలిక మిస్సింగ్ కేసును కేవలం 48 గంటల్లో చేధించారు.
ఇంతకీ ఆ కేసు ఏంటి?
మార్వాడి కుటుంబం దాదాపు రెండు దశాబ్దాల కిందట ఏపీలోకి కాకినాడ జిల్లా కరప గ్రామంలో సెటిల్ అయ్యింది. వ్యాపారం చేసుకుంటూ ఆ ఇంటి పెద్దాయన అక్కడే ఉంటున్నాడు. జూన్ 8న ఆ వ్యాపారి 14 ఏళ్ల కూతురు కనిపించకుండా పోయింది. వెంటనే ఆ పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రెండువారాలు గడుస్తున్నా బాలిక మిస్సింగ్ వ్యవహారంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.
ALSO READ: టీటీడీ కొత్త ఆలోచన.. భక్తులకు తీపికబురు
చివరకు విసిగి పోయిన బాలిక తల్లిదండ్రులు, రాజమండ్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్నారు. ఆయనను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అధికారులు ఆ అవకాశం ఇవ్వలేదు. చివరకు రాజమండ్రి ఎయిర్‌పోర్టు, అఖండ గోదావరి సభ వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు ఆ తల్లిదండ్రులు. ఆ ప్లకార్డులను పవన్ కళ్లను టచ్ చేశాయి.
దానిపై అధికారుల నుంచి ఆరా తీశారు. కేవలం 48 గంటల్లో ఆ కేసుకు ముగింపు పలికారు. చివరకు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. దీనిపై ఆ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు. నిరసన తెలిపితే గాని కేసుల నుంచి పోలీసులు పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ సభలో అధికారులు తీరు మార్చుకోవాలి, తమకు సహకరించాలని పదేపదే చెబుతున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. అయినా తీరు మారినట్టు కనిపించలేదు. అందుకు ఎగ్జాంపుల్ కాకినాడ బాలిక మిస్సింగ్ వ్యవహారం. అధికారుల తీరు ఇలాగే కంటిన్యూ అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయమంటున్నారు.
రేపో మాపో ప్రజల వద్దకు వెళ్తానంటున్నారు సీఎం చంద్రబాబు. ఆయన వస్తేనే గానీ తమ సమస్యలకు పరిష్కారం లభించదని అంటున్నారు కొన్ని కుటుంబాలు. మొత్తానికి సీఎం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు.