BigTV English

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Cloudburst: ఉత్తరాఖండ్ పై జలఖడ్గం మళ్లీ విరుచుకుపడింది. పుష్కర కాలం క్రితం అంటే 2013 నాటి ఘటన మళ్లీ గుర్తుకు చేసింది. 2021లో క్లౌడ్ బరస్ట్.. లో 200 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే హిమాలయ రాష్ట్రంలో మరో జల విలయం విలయ తాండవం చేసింది. వరుసగా ఏంటీ ప్రకృతి వైపరీత్యాలు? ఎందుకిలా ఉరుగుతున్నాయి? ఇందుకు గల కారణాలేంటి? ప్రస్తుతం ఘటనా స్థలిలో ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? అక్కడెలా ఉందో ఇప్పుడు చూద్దాం.


ఖీర్ గంగా నది ఉప్పొంగడమే కారణం

ఉత్తరాఖండ్, ఉత్తర కాశీ జిల్లా, ధారలీ గ్రామం, ఆగస్ట్ 05వ తేదీ, మంగళవారం.. మధ్యాహ్నం 1గం. 30 ని. లు.. ఒక్కసారిగా జలఖడ్గం విరుచుకుపడ్డంతో అక్కడి ప్రజలకు మొదట అది కలా నిజమా అర్ధం కాలేదు. ఆ దృశ్యం చూసిన కొందరైతే ఆ వరద ఉధృతిని సినిమాలో చూసినట్టు కేరింతలు కొట్టారు. అరిచి గోల పెట్టారు. ఉన్నట్టుండి ఈ వరద రావడానికి గల కారణం ఖీర్ గంగా నది ఉప్పొంగడం. వరద తనతో పాటు కొన్ని వందల టన్నుల కొద్దీ బురదను కొండప్రాంతంపైకి ఎగజిమ్మడంతో.. ఇదిగో ఇదీ పరిస్తితి. ఇళ్లు పేక మేడల్లా కొట్టుకుపోతున్న దృశ్యం చూసిన వారికి తర్వాతగానీ అసలు విషయం అర్ధం కాలేదు. ఇదొక మృత్యు ఘోష.. ప్రకృతి ప్రకోపమని అప్పుడుగానీ తెలియ కాలేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అంతే కాదు కొండచరియలు విరుచుకుపడే ఛాన్సు కూడా ఉన్నట్టు వార్న్ చేసింది. దీంతో కొన్ని ప్రాంతాలకు వెళ్లొద్దని కూడా సూచించింది. దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి కూడా.


కొంత కాలంగా పర్యాటకులను ఆపుతోన్న అధికారగణం

వరదతో పాటు వచ్చిన బురద.. భాగీరథీ నదిని ముంచెత్తింది. మాములుగా అయితే ఈ భాగీరథీ నది దిగువకు ప్రయాణించాక పవిత్ర గంగానదిగా రూపాంతరం చెందుతుంది. ఈ క్రమంలో ఒక కృత్రిమ సరస్సు ఏర్పడుతుంది. ఇపుడీ భౌగోళిక సౌందర్యమంతా బురద బురదై పోయింది. అంతే కాదు ప్రభుత్వ హెలిప్యాడ్ తో సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. అదృష్టమేంటంటే గత కొన్నాళ్లుగా అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించకుండా పర్యాటకులను కట్టడి చేస్తున్నారు. భారీ వర్షాపాతం ఉంది కాబట్టి అనుమతించేది లేదంటూ టూరిస్టులను ఆపుతున్నారు. లేకుంటే పరిస్థితి మరింత భయానకంగా మారి ఉండేదని అంటున్నారు. ఒక్కసారిగా క్లౌడ్‌ బరస్ట్‌. ఒక్కసారే పది సెంటీమీటర్ల వర్షపాతం. ఆకాశానికి చిల్లుపెడితే కురిసిన కుండపోత. ఆతర్వాత ఎప్పుడూ కనీ వినీ ఎరుగనీ విపత్తు.. ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అన్న స్థాయిలో క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో నీరు, అక్కడున్న మట్టి కలిసి పెద్ద ఎత్తున బురద వరద ధరాలిని కమ్మేసింది. అందమైన గ్రామం ఇప్పుడు మట్టి దిబ్బను తలపిస్తోంది.

స్పాట్‌లో నలుగురు మృతి, 70 మంది గల్లంతు

ఉత్తర కాశీలో సంభవించిన వరదల కారణంగా గ్రామానికి గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. వరదల ధాటికి ఇళ్లు, హోటళ్లు కుప్ప కూలిపోయాయి. అనేకమంది గల్లంతయ్యారు. ఒక పక్క సహాయక చర్యలు కొనసాగుతున్నా.. వరద బీభత్సం ఇక్కడి వారిలో తీవ్ర విషాదాన్ని నింపింది. అకస్మాత్తుగా ముంచెత్తిన వరదల కారణంగా.. స్పాట్లో నలుగురు చనిపోగా.. 60-70 మంది వరకు వరదల్లో కొట్టుకుపోయినట్టు సమాచారం. ఇప్పటి వరకు సహాయక బృందాలు 12 మంది మృతదేహాలను వెలికి తీశాయి. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. వరదల్లో హర్సిల్‌లోని సైనిక శిబిరం కొట్టుకుపోయిగా.. 10 మందికిపైగా జవాన్లు గల్లంతయ్యారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. వరదల్లో గల్లంతైన వారి గురించి పూర్తి సమాచారం తెలియరాలేదంటున్నారు అధికారులు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద.. కింద ప్రాంతంలోని ధరాలి గ్రామం వైపునకు దూసుకొచ్చింది. వరద ధాటికి మూడునాలుగంతస్తుల భవనాలు సైతం పేక మేడల్లా కూప్పకూలిపోయాయి. వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదం కారణంగా గ్రామంలోని పాతిక వరకూ హెటళ్లు, హోంస్టేలు కూడా కొట్టుకుపోయినట్టు చెబుతున్నారు అధికారులు.

ఆకస్మిక వరదపై ప్రధాని తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం

ఆకస్మిక వరదలపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం రాకుండా చూడాలని సీఎం పుష్కర్‌సింగ్‌ ధామికి ఫోన్‌లో సూచించారు. సహాయక చర్యల కోసం 150 మంది సైనికులను హుటాహుటిన ఘటనా స్థలికి పంపంది ఇండియన్ ఆర్మీ. ఉత్తరకాశీలోని హర్సిల్ ప్రాంతంలోని ఖీర్​గఢ్​‌లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరదల వల్ల ఇప్పటికే చాలా మంది ప్రజలు దిగ్బంధంలో ఉన్నారు. పరిస్థితి భయానకంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ అధికారులు. మరోవైపు ఉత్తరకాశికి 20 కి.మీ ముందుండే.. నలుపానీ లో పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీని కారణంగా రాకపోకలు బంద్‌ అయ్యాయి. భట్వారీలో దాదాపు 150 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. ఇందువల్ల అనేక మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వరద బాధితుల రక్షణార్ధం ధరాలికి వస్తున్న ITBP జవాన్లు మనేరి దగ్గర్లో చిక్కుకున్నారు.

ఆగస్టు 10 వరకూ ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ

ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్‌​లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానికులు, పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. 2013, 2021, 2025. తరచూ ఉత్తరాఖండ్ ని వరద ముంచెత్తుతూనే ఉంది. కారణమేంటి? ఈ ప్రాంతంలో ఎందుకిలా జరుగుతోంది? రీజన్లు ఏమై ఉంటాయి. ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. అభివృద్ధి పేరిట సహజ సిద్ధ నీటి మార్గాలను తొలిస్తే ప్రమాదమని పర్యావరణ వేత్తలు ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు. కానీ పరిస్థితి ఎంత మాత్రం కుదుట పడ్డం లేదు సరికదా.. నానాటికీ ఈ ప్రమాదాలు పెరుగుతూ పోతూనే వస్తున్నాయి తప్ప తగ్గడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది పర్యావరణ వేత్తల నుంచి. ఉత్తరాఖండ్ లో తరచూ వరద ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలేంటి? దేవభూమిపై ఎప్పుడూ జలఖడ్గం విరుచుకుపడుతూనే ఉంటుంది ఎందుకని? పర్యాటకం పేరిట జరుగుతున్న విధ్వంసమేంటి? అభివృద్ధి పేరిట సాగుతోన్న వినాశనం ఎలాంటిది? ఎందుకిలా పదే పదే జరుగుతోంది. ఇందుకు ఎలాంటి అంశాలు కారణమవుతున్నాయి? ఆ వివరాలు ఎలాంటివి?

నేల కుంగిపోయే ప్రమాదముందన్న హెచ్చరికలు

ధరాలీ మధ్యగా వెళ్లే జాతీయ రహదారి2013లో మేఘ విస్ఫోటనం కారణంగా కొండ చరియలు విరిగి పడి.. అనేక గ్రామాలు పట్టణాలు ధ్వంసమయ్యాయి. మరీ ముఖ్యంగా కేదార్ నాథ్ లో భారీ నష్టం సంభవించింది. వందలాది మంది కొట్టుకుపోయారు. కొందరు మృతదేహాల జాడ ఇంకా తెలియ రాలేదు. ఇక 2021లో ఇక్కడ క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 2025 ఆగస్ట్ 5 నాటి ఘటన విషయానికి వస్తే.. ఈ వరద ఉధృతికి కారణం క్లౌడ్ బరస్టా? లేక గ్లేసియర్లు కరగటమా? రీజన్ ఏమై ఉంటుందన్న పరిశోధన చేస్తున్నారు వాతావరణ నిపుణులు. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతం కావడంతో రుతుపవన గాలులకు హిమాలయ పర్వత శ్రేణులు అడ్డు తగులుతుంటాయి. దీంతో తేమ నిండిన మేఘాలు.. ఒకే చోట పేరుకుని చల్లని వాతావరణం కారణంగా ఒక్కసారిగా భళ్లున వర్షం కురుస్తుంది. దీన్నే క్లౌడ్ బరస్ట్ అంటారు. దీంతో ఆకస్మిక వరద, కొండ చరియలు విరుచుకుపడ్డం వంటి దుర్ఘటనలు ఏర్పడతాయన్నది ఒక వాదన. క్లౌడ్ బరస్ట్ వల్ల నదుల్లోని నీటి మట్టం అమాంతం పెరుగుతుంది. అనుకోని వరద విపత్తు ఏర్పడుతుంది. దీంతో వరదలు బురద, రాళ్లు, చెట్లను వెంటపెట్టుకొచ్చి భారీనష్టాన్ని కలిగిస్తాయని అంటారు వాతావరణ నిపుణులు. ఈ ప్రాంత భౌగోళిక అస్థిరత మరో అతి పెద్ద బలహీనత. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే ప్రాంతం కాబట్టి.

రోడ్ల విస్తరణ వంటి పలు నిర్మాణ పనుల వల్ల కూడా విపత్తే

ఈ పర్వతాలు తరచు భూకంపాలు, ఆపై కొండ చరియలు విరుచుకుపడే అవకాశం కలిగి ఉంటుంది. దీంతో తరచూ ఏవో ఒక విపత్తులు ఏర్పడుతుంటాయని అంటారు పర్యావరణ వేత్తలు. భాగేశ్వర్ జిల్లాలో విచ్చలవిడిగా జరిగే మైనింగ్ కారణంగా నేల కుంగిపోయే ప్రమాదముందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. గతంలో జోషీ మఠ్ లో సరిగ్గా ఇలాగే జరిగింది. నివాస ప్రాంతాల్లో మైనింగ్ చేయడం కూడా ముప్పునకు ఒక కారణమేనంటారు. ఈ వ్యర్ధాలను నదుల్లోకి పారేయడం వంటివి కూడా ప్రమాదకర స్థితిగతులకు కారణమవుతుంటాయని అంటారు వాతావరణ నిపుణులు. ఇక్కడ జరుగుతోన్న మైనింగ్ కి తగిన అనుమతులు లేవు. అయినా సరే యధేచ్చగా తవ్వుతూ పోవడం వల్ల నేల కుంగడం, కొండ చరియలు విరిగి పడ్డం వంటి విపత్తులకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ వల్ల జరిగే మరో ప్రమాదం ఏంటంటే.. సహజ ప్రవాహ మార్గాలు దెబ్బ తింటాయి. దీని వల్ల కొండ అడుగు భాగంలో నీరు చేరి బలం తగ్గుతుంది. ఇది అతి పెద్ద సమస్యగా తయారైంది. అలాగని అనుమతులున్న కట్టడాలు, నిర్మాణాల వల్ల ఎలాంటి నష్టముండదని కాదు. టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా.. రోడ్ల విస్తరణ, ఇతర నిర్మాణ పనుల వల్ల కూడా.. పర్యావరణ వ్యవస్థ దారుణంగా దెబ్బ తింటూనే వస్తుంది. అందుకే అప్పుడప్పుడూ ప్రకృతి విలయ తాండవం ఇదిగో ఇలాంటి విపత్తులను కొని తెస్తోందని అంటారు పర్యావరణవేత్తలు.

నదుల్లో నీటి ప్రవాహం పెరిగి ఆకస్మిక వరద

ఇక గ్లోబల్ వార్మింగ్ కారణాల వల్ల హిమాలయాల్లోని గ్లేసియర్లు వేగంగా కరుగుతున్నాయ్. ఇందువల్ల నదుల్లో నీటి ప్రవాహం పెరిగి ఆకస్మిక వరదలు విరుచుకుపడే ప్రమాదం కలుగుతోంది. గ్లేసియర్ల కరుగుదల తీవ్ర పర్యావరణ సమస్యగా మారుతూ వస్తోంది. ఇందుకు ప్రధానమైన కారణం గ్లోబల్ వార్మింగ్. శిలాజ ఇంధనాలు విపరీతంగా వాడ్డం వల్ల.. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ ఉద్ఘారాలు సాంధ్రత పెంచుకుతుంది. ఇవి సూర్య రశ్మిని గ్రహించి.. భూమి వేడెక్కడానికి కారణమవుతాయి. దీంతో గ్లేసియర్లు కరిగి.. ఇలాంటి అనూహ్య వరదలకు కారణమవుతుంటాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాత సరళిలో మార్పులు వస్తున్నాయి. ఒక సారి అతి భారీ వర్షాలు కురవడమే క్లౌడ్ బరస్ట్ గా చెబతారు. ఇలాంటి ఎన్నో రకాల కారణాల వల్ల ఉత్తరాఖండ్ తరచూ ప్రకృతి విపత్తులకు కారణమవుతుందని.. అంటున్నారు పర్యావరణవేత్తలు. ఇక్కడున్నదే సున్నితమైన వాతావరణ వ్యవస్థ. భౌగోళిక పరిస్థితులు ఎంత మాత్రం అంచనా వేయకుండా.. అభివృద్ధి పనులు చేస్తూ పోతుంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

గ్లేసియర్ కూలడం వల్లే ఇదంతా అన్న అంచనా

ఇంతకీ ధరాలీలో జరగింది క్లౌడ్ బరస్టేనా.. అనిచూస్తే.. మంగళవారం నాటి విధ్వంసానికి కారణం గ్లేసియర్ కూలిపోవడం లేదా సరస్సు ఉప్పొంగడం ప్రధాన కారణం అయి ఉండొచ్చని అంటారు పలువురు వాతావరణ నిపుణులు. ఉపగ్రహ డాటా విశ్లేషకులు ప్రాధమిక అంచనాగా దీన్నే చెబుతున్నారు. అందుకే అంత భారీ పరిమాణంలో వరద నీటి ప్రవాహం ధరాలీని ముంచెత్తి ఉండొచ్చని అంటున్నారు. మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే.. మంగళవారం హార్సిల్ ప్రాంతంలో 24 గంటల్లో కురిసిన వర్షపాతం కేవలం 9 మిల్లీ మీటర్లు మాత్రమే. ఇక భట్వానీలో 11 మిల్లీమీటర్లు మాత్రమే కురిసినట్టు చెబుతున్నాయి వాతావరణ గణాంకాలు. మాములుగా క్లౌడ్ బరెస్ట్ అయితే అంతకన్నా మించి వర్షపాతం నమోదు అవుతుంది. దీంతో గ్లేసియర్ కూలడం వల్లే ఇదంతా జరిగినట్టుగా అంచనా. ఇక క్లౌడ్ బరస్ట్ జరిగితే.. ఎలాంటి విలయం సృష్టిస్తుందో చెప్పడానికి 2013లో జరిగిన కేదారనాథ్ విపత్తు ఒక ఉదాహరణగా చెబుతారు. ఇది ఉత్తరాఖండ్ లో సంభవించిన అతి పెద్ద విపత్తుల్లో ఒకటి. రుతుపవనాలు, వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ కలయిక వల్ల అసాధారణమైన వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఇందువల్లే 2013 కేదార్ నాథ్ డిజాస్టర్ సంభవించింది. ఈ రెండింటి కలయిక వల్ల.. హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యధిక తేమతో కూడిన మేఘాలు ఏర్పడి క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీని వల్ల అతి భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు వచ్చి తీవ్ర నష్టం సంభవించినట్టుగా చెబుతారు నిపుణులు.

ప్రస్తుతం వరద విపత్తు కారణంగా తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన ధరాలీ ఎక్కడుందని చూస్తే.. ఎత్తైన పర్వతాల మధ్య. ఉత్తరాఖండ్ లోని సుందరమైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. గంగోత్రి యాత్రకు వెళ్లే ప్రయాణికులకు ఇదొక విడిది. ఈ ప్రాంతం ప్రస్తుతం ఒకే ఒక్క వరదతో తుడిచిపెట్టుకుపోయి తీవ్రవిషాదాన్ని నింపింది. కేవలం గంట వ్యవధిలో ఈ ప్రాంతం మీదకు సముద్రం గానీ విరుచుకుపడిందా? అన్న స్థాయిలో మేఘం వర్షించింది. దీంతో భారీ బురద వరద ధరాలిని కమ్మేసింది. ఫలితంగా ఈ ప్రాంతమిపుడు మరుభూమిని తలపిస్తోంది.

Also Read: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

చార్ ధామ్ యాత్రికులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. యాపిల్ పండ్లకు ప్రసిద్ధి చెందిన హార్సిల్ లోయ ఇక్కడకు దగ్గర్లో ఉంటుంది. రిషికేశ్ నుంచి బయల్దేరి చంబా, ఉత్తర కాశీ, హారసిల్ మీదుగా ఇక్కడికి రావచ్చు. సముద్ర మట్టానికి 2, 680 మీటర్ల ఎత్తున ఉంటుందీ ప్రాంతం. గంగోత్రి ఇక్కడి నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమే. ధరాలీ గ్రామం మధ్య నుంచే జాతీయ రహదారి సైతం వెళ్తుంది. చార్ ధామ్ సహా పలు టూరిస్టు సీజన్లలో ఈ గ్రామానికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో హోటళ్లు,గెస్టు హౌసులున్నాయి. తక్కువ ధరలకే వసతి సౌకర్యం లభించడంతో.. కేదార్ తాల్ ట్రెక్కింగ్ వెళ్లేవారు ఈ ప్రాంతాన్ని తమ బేస్ క్యాంప్ గా చేస్కుంటారు. ప్రకృతికి కూడా ఒక సహనం. సంయమనం ఉంటుంది. అది ఓర్చుకుంటూ వస్తుంది కదాని విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తే.. ఆ భూగర్భం కూడా ఒక్కోసారి భగ్గుమంటుంది. కొన్నేళ్లుగా ఉంటూ వస్తున్న సహజ ప్రవాహ మార్గాలను మూసుకుంటూ పోతే.. ఇదిగో ఇలాంటి విలయాలు తరచూ ఎదుర్కోవల్సి వస్తుందంటారు పర్యావరణ నిపుణులు.

Story By adinarayana, Bigtv

Related News

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Big Stories

×