Teacher Zomato Delivery Boy| ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలో.. లేక నాలుగు నెలలుగా జీతం అందడం లేదని బాధపడాలో తెలయని దుస్థితిలో బిహార్ టీచర్లున్నారు. అందుకే ఉద్యోగం వదులుకోలేక రాత్రివేళ ఫుడ్ డెలివరీ బాయ్ గా, ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. 2022 సంవత్సంలో బిహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ లో నివసించే అమిత్ కుమార్ అనే వ్యక్తి టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో అతని తల్లిదండ్రులు, భార్య అందరూ ఆ రోజు ఇంట్లో పండగ చేసుకున్నారు. అప్పటికే అమిత్ కుమార్ గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. కానీ మధ్యలో కరోనా లాక్ డౌన్ కారణంగా రెండేళ్లు వ్యర్థమయ్యాయి. అయితే అమిత్ కుమార్ ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో బాగా కష్టపడి పరీక్షల కోసం సిద్దమయ్యారు. 2022లో బిహార్ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ప్రకటించగానే ఆ పరీక్షలు రాసి ఉద్యోగం సాధించారు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు.
అమిత్ కుమార్ ఇప్పుడు టీచర్ తక్కువ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఎక్కువ. అమిత్ కుమార్ కు పార్ట్ టైమ్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. ఆయనకు కేవలం రూ.8000 నెల జీతం. ఆ మాత్రం సంపాదనతో ఆయన ఇంటి భారం మోయలేక చాలా ఇబ్బందులు పడ్డాడు. చేయాల్సింది పార్ట్ టైమ్ అయినా ఆయన ఫుల్ టైమ్ పనిచేసి పిల్లలకు మోటివేట్ చేసి క్రీడల్లో పాల్గొనాలని చెప్పేవాడు. ఆయన వద్ద చదువుకున్న వారు చాలామంది విద్యార్థులు బాగా రాణిస్తున్నారు.
కానీ వ్యక్తిగతంగా అమిత్ కుమార్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాలు గడిచినా జీతం పెరగలేదు. పైగా ఆయన ఉద్యోగం పర్మనెంట్ కాలేదు. ఆయనతోపాటు పనిచేసే ఉపాధ్యాయులు నెలకు రూ.42,000 జీతం సంపాదిస్తున్నారని అమిత్ కుమార్ తెలిపారు. కానీ తనది పార్ట్ టైమ్ టీచర్ ఉద్యోగం కావడంతో తక్కువ జీతం పైగా నాలుగు నెలలుగా జీతం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోక పోవడంతో తాను అప్పులు చేయాల్సి వచ్చిందని.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు. ఇది తనఒక్కడి కథ మాత్రమే కాదు.. తన లాగా పనిచేసే పార్ట్ టైమ్ టీచర్లందరి స్థితి ఇదేనని వాపోయాడు. ఇలాంటి సమయంలో తన భార్య సలహా మేరకు జొమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా చేరానని అమిత్ కుమార్ తెలిపాడు.
“నేను ఈ పనిలో చేరేముందు బాగా పరిశీలించాను. ఈ పనిచేయడానికి ఎటువంటి నిర్ణీత పనివేళలు లేవు. అందుకే పగలు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తేన్నా.. సాయంత్రం 5 నుంచి రాత్రి 1 వరకు ఫుడ్ డెలివరీ చేస్తున్నాను. నాకు వచ్చే రూ.8000 జీతంతో నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? నా ఖర్చులకే ఇది సరిపోదు.. మరి నా పిల్లలకు ఏం పెట్టాలి? ఇంట్లో మా అమ్మ వృద్ధరాలు. అందుకే అందరినీ పోషించడానికి రెండు ఉద్యోగాలు చేయక తప్పడం లేదు.” అని ఆయన అన్నాడు.