పార్లమెంట్ సభ్యుల(లోక్ సభ, రాజ్యసభ) జీతభత్యాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ ఇప్పుడు విడుదలైనా.. 2023 ఏప్రిల్ 1 నాటి నుంచే వారి జీతాల పెంపు అమలులోకి వస్తుందని ప్రకటించింది. అంటే జీతాల పెంపుతోపాటు.. దాదాపు రెండేళ్ల అరియర్స్ ని కూడా ఎంపీలు అదనంగా అందుకోబోతున్నారనమాట.
ఇంతకీ ఎంపీ జీతం ఎంత..?
పాత నెల జీతం రూ. 1 లక్ష
కొత్త జీతం రూ. 1.24 లక్షలు
ఇది కేవలం జీతంలో పెరుగుతల మాత్రమే ఇక రోజువారీ ఇచ్చే అలవెన్స్ 2వేల రూపాయలనుంచి 2500 రూపాయలకు పెంచారు. అంటే పెరిగిన జీతంతోపాటు అలవెన్స్ ని కూడా కలుపుకుంటే భారీగానే ఈ పెరుగుదల వర్తించబోతోంది.
పెన్షన్లు కూడా..
మాజీ ఎంపీలకు ఇస్తున్న పెన్షన్ ని కూడా కేంద్రం సవరించింది. ఇప్పటి వరకు మాజీ ఎంపీలకు నెలకు రూ.25వేలు ఇస్తుండగా ఇప్పుడు దాన్ని రూ.31వేలకు పెంచారు. మాజీ ఎంపీలలో కొందరికి పెన్షన్ భారీగా పెరగబోతోంది. ఒక దఫా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తే నెలకు రూ.31వేలు పెన్షన్ ఇస్తారు. అంతకు మించి ఆయన పని చేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రూ.2500 ఇస్తారు. గతంలో అదనపు సంవత్సరానికి లభించే మొత్తం రూ.2వేలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని 2500 రూపాయలకు పెంచారు.
అదనపు ప్రయోజనాలు..
ఇక పార్లమెంట్ సభ్యులకు జీత, భత్యాలతోపాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. పార్లమెంట్ నియోజకవర్గ ఖర్చులకోసం నెలకు రూ.70వేలను అదనపు అలవెన్స్ గా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ అలవెన్స్ తోపాటు ఎంపీ ఆఫీస్ నిర్వహణ కోసం కూడా భారీగానే నిధులిస్తుంది. ఆఫీస్ మెయింటెనెన్స్ ఇతరత్రా ఖర్చులకోసం నెలకు 60వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది. అద్దె భత్యం గరిష్టంగా రూ.2 లక్షలుగా ఉంది. రవాణా భత్యం కూడా ఎంపీలకు ఇస్తారు. రోడ్డుపై ప్రయాణం చేస్తే కిలోమీటర్ కు 16 రూపాయల చొప్పున బిల్లులు పెట్టుకునే అవకాశం ఉంది. రైలులో ప్రయాణం చేయాలంటే ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో ఉచిత ప్రయాణం ఎంపీలకు అందుబాటులో ఉంటుంది. ఏడాదిలో 34సార్లు ప్రభుత్వ ఖర్చుతో విమాన ప్రయాణం చేసే అవకాశం ఎంపీలకు ఉంది. ఇవి కాకుండా మెడికల్ అలవెన్స్ లు, ఉచిత విద్యుత్, ఉచిత తాగునీటి సౌకర్యం కూడా ఎంపీలకు ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చేసి కాల్స్, డేటా వ్యయం బాగా తగ్గినా కూడా ఎంపీలకు మాత్రం దానికి కూడా బిల్లులు పెట్టుకునే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన ఈ వెసులుబాటుని ఇంకా ప్రభుత్వం మార్చలేదు.
చివరిగా 2018లో..
ఎంపీలుగా తీసుకునే జీత భత్యాలతోపాటు కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, ప్రధానికి ఇతర ప్రత్యేక వెసులుబాట్లను కేంద్రం కల్పిస్తోంది. అదనపు అలవెన్స్ లు తీసుకునే అవకాశం వీరికి ఉంది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం వ్యయ, ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు పెంచారు. చివరిసారిగా ఎంపీల జీత భత్యాలను 2018లో పెంచారు. ఆ తర్వాత కరోనా ఇబ్బందులు, ఇతరత్రా వ్యవహారాలతో పెరుగుదలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరికి ఇప్పుడు ఎంపీల జీతాల పెంపుపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం విశేషం. అయితే ఈ పెంపుని 2023 ఏప్రిల్ నుంచి అమలు చేయడం మరో విశేషం.