Mukesh Ambani – OpenAI Meta : విశాలమైన మార్కెట్ అందుబాటులో ఉన్న ఇండియాలో కార్యకలాపాలు పెంచుకునేందుకు అంతర్జాతీయ ఏఐ టెక్ దిగ్గజాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన జియోతో భాగస్వామ్యం కోసం తీవ్రంగా చర్యలు జరుగుతున్నాయి. ఇంటర్నేషన్ స్థాయి సంస్థలైన OpenAI, Meta ప్లాట్‌ఫారమ్‌లు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో విడివిడిగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దేశంలో ChatGPTని విస్తృతంగా వినియోగంలో తీసుకువచ్చేందుకు.. బలమైన జట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం మొబైల్ నెట్ వర్క్ తో పాటుగా ఇంటర్నెట్ ప్రోవైడర్ గానూ జియో అతిపెద్ద సంస్థగా ఉండడంతో.. ఈ సంస్థలు జియోతో విడివిడిగా చర్చలు జరుపుతున్నాయి.
భారత్ లో రిలయన్స్ జియో విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించి మార్కెట్లో అగ్రస్థానంలో నిలవాలని ఈ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ఏఐ పెద్ద ఎత్తున మార్పులకు కారణం అవుతోంది. ఇండియాలోనూ ఊహించిన దానికంటే చాలా వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగం పెరిగిపోతుంది. ఈ సమయంలో దేశంలోని బలమైన భాగస్వామ్యం ఉండాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. అలాగే.. ఈ సంస్థలు అందిస్తున్న సేవల్ని మరింత చౌకగా అందించాలంటే జియో వంటి సంస్థల సహకారం తప్పనిసరి. లేదంటే.. ఈ స్థాయి మౌలిక వసతులు కల్పించుకునేందుకు చాలా సమయం, ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే.. ముఖేష్ అంబానీ సంస్థతో పోటీపడి చర్చలు జరుపుతున్నాయి. కాగా.. దేశంలోకి అడుగుపెట్టాలంటే మాత్రం ChatGPT సబ్‌స్క్రిప్షన్ ధరను భారీగా తగ్గించాల్సి ఉంటుంది. ప్రస్తుత చాట్ జీపీటీ నెలకు $20 వరకు వసూలు చేస్తుండగా.. ఈ ధరల్ని 75 -85% తగ్గించే అవకాశం ఉంది. దీంతో.. మరింత చౌకగా.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రిలయన్స్ ఓపెన్ AI మోడళ్లను విక్రయించనుందా?
రిలయన్స్ తన ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ లేదా API ద్వారా OpenAI మోడళ్లను విక్రయించడం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని సంస్థలే దేశీయంగా OpenAI మోడళ్లను హోస్ట్ చేయడం, నిర్వహణ ఉంచాలనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వం ఇతర అనేక సందర్భాల్లో సూచించినట్లుగా.. దేశీయ వినియోగదారుల డేటా, సమాచారం ఇక్కడే ఉండే అవకాశాలున్నాయి. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇటీవల భారత్.. తమకు రెండో అతిపెద్ద మార్కెట్ అని వెల్లడించారు. గత సంవత్సరం ఓపెన్ ఏఐ యూజర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగారని తెలిపారు.
రిలయన్స్ వరల్డ్ లార్జెస్ట్ డేటా సెంటర్
దేశంలోని డేటా, మొబైల్ నెట్వర్క్ విస్తరణలో అనూహ్య మార్పులకు కారణమైన జియో.. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది. అందులో భాగంగా.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు గిగావాట్ల డేటా సెంటర్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ డేటా కేంద్రం కూడా.. మెటా, ఓపెన్‌ఏఐ మోడళ్లను నిర్వహించేందుకు సరిపోతుందని ముఖేష్ అంబానీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ డేటా కేంద్రమే సాకారమైతే.. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా మారుతుందని చెబుతున్నారు.
Also Read : Anti Drone System : సరిహద్దుల్లో డ్రోన్ల ఆగడాలకు చెక్ – DRDO అద్భుత ఆవిష్కరణ