Bus catches fire in Haryana: హర్యానాలో ఘోరం జరిగింది. నుహ్‌కు సమీపంలోని ఓ టూరిస్టు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు పది మంది సజీవ దహనమయ్యారు. దాదాపు 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో బస్సులో 64 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైనవారులో ఎక్కువగా పంజాబ్, చండీగఢ్ వాసులు ఉన్నారు.
అసలేం జరిగింది? డీటేల్స్‌లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి 60 మంది భక్తులతో ఓ టూరిస్టు బస్సు హర్యానా వైపు వస్తోంది. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావనం యాత్రకు ముగించుకుని తిరిగి వస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంటన్నర మధ్యలో హర్యానాలోని నుహ్ సమీపానికి బస్సు చేరుకుంది.
కుండలి- మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వేకి వచ్చింది. అర్థరాత్రి కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మరి ఏమైందో తెలీదుగానీ బస్సులో మంటలు వ్యాపించాయి. దాదాపు 10 మంది భక్తులు సజీవ దహనమయ్యారు. అందులో ప్రయాణిస్తున్నవారు పంజాబ్, హర్యానా ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. 20 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది కాలిపోయారు. మరికొందరు స్థానికుల సహాయంతో బయట పడ్డారు.
గాయపడినవారిని నుహ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనపై నుహ్ ఎమ్మెల్యే అఫ్తాబ్ విచారం వ్యక్తంచేశారు.
బస్సు వెళ్తున్న సమయంలో మంటలు అంటుకున్నాయి. సమీపంలోని గ్రామస్తులు బస్సు ఆపాలని కేకలు వేసినా డ్రైవర్ ఆపలేదు. ఆ తర్వాత టూ వీలర్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు బస్సును వెంబడించి మంటలు చెలరేగిన విషయాన్ని డ్రైవర్‌కు చెప్పారు. బస్సు ఆగినప్పటికే మంటలు దాదాపు చుట్టుముట్టాయి.
ALSO READ: ఆప్‌లో చీలిక ఖాయమా? స్వాతి మలివాల్ కేసులో న్యూట్విస్ట్!
మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు శతవిధాలా ప్రయత్నం చేశారు. ఈ ఘటన సమయంలో ఎక్స్‌ప్రెస్ వేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొత్తానికి పోలీసులు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.