Heavy Rains In Bengaluru: బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో అనేక కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. బెంగళూరులో రెండు రోజులపాటు కురుస్తున్న వానతోటి జనజీవనం స్తంభించిపోయింది. ఓ వైపు వాహనా దారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాహనాలు కూడా మునిగిపోతున్నాయి. ఒక బెంగళూరులో మాత్రమే కాదు మొత్తంగా 23 జిల్లాలో కూడా వర్షం కురుస్తూ ఉంది. ఎడతెరపిలేకుండా వాన కురుస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో.. వారందరని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే వాతావరణానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. అయితే రోడ్లపైకి విపరీతంగా వరద నీరు రావడంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా బెంగళూరును వర్షం ముంచెత్తింది. మే 22 వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా మూడురోజులు పాటు ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే పరిస్తితి నెలకొంది.
బెంగళూరు సిటీ కోలార్ చిక్మంగళూరు, తమ్మకూరు, మాండ్యం, మైసూర్, దావన్ గిరి మిగతా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
ఇదిలా ఉంటే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు తీరానికి దగ్గరగా ఉంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సోమవారం చేరనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం తీవ్రత పెరిగి తుపానుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలుండగా, గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో..గద్వాల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బెల్లంపల్లి, జగిత్యాల.. ఇలా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఐతే.. గాలి వేగాన్ని బట్టీ.. వర్షం పడే ప్రాంతాలు మారే అవకాశాలూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో చెట్ల కిందకు వెళ్లకూడదని వాతావరణ కేంద్రం సూచించింది.
రానున్న మూడు రోజులు ఉత్తర,దక్షిణ తెలంగాణలో సాధారణ కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఎండ తక్కువే ఉన్నా… మేఘాల వల్ల కొంత ఉక్కపోత ఉంటుందని చెప్పింది. ఇక తేమ పగటివేళ తెలంగాణలో 49 శాతం ఉండగా.. రాత్రివేళ తెలంగాణలో 72 శాతం ఉంటుందని పేర్కొంది.
Also Read: వివాహేతర సంబంధం.. భార్యకు విడాకులిస్తే భరణం, కోర్టు సంచలన తీర్పు
మరోవైపు నైరుతి రుతుపవనాలు మరో పది రోజుల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22న అండమాన్‌ను, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా.. అందుకు పది రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్‌లో విస్తరించాయి. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదలడానికి అనుకూల పరిస్థితులున్నాయని చెప్పింది.