Vistadome Safari Journey: ప్రకృతి అందాలను మరింత చక్కగా చూసేందుకు వీలుగా పర్యాటక ప్రాంతాల్లో విస్టాడోమ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దేశ విదేశాల్లోనూ ఈ రకమైన రైళ్లు నడుస్తున్నాయి. చాలా మంది విస్టాడోమ్ రైలు ప్రయాణం చేసేందుకు ఎంతగానో ఇష్టపడుతుంటారు. కనువిందు చేసే ప్రకృతి అద్భుతాలను చూస్తూ మైమరచిపోతారు. అదే విస్టాడోమ్ రైల్లో సఫారీ జర్నీ చేస్తే ఇక ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. తాజాగా దేశంలో ఇలాంటి ఎక్స్ పీరియెన్స్ కలిగించేందుకు తొలిసారి విస్టాడోమ్ సఫారీ జర్నీ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడో తెలుసా..
దేశంలోనే తొలి విస్టాడోమ్ సఫారీ జర్నీ
వైల్డ్ సఫారీని ఇష్టపడే పర్యాటకులకు అద్భుతమైన అనుభూతి కల్పించేందుకు దేశంలొనే తొలి విస్టాడోమ్ జంగల్ సఫారీ రైలును ప్రారంభించింది యూపీ సర్కారు. కతార్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, దుధ్వా టైగర్ రిజర్వ్ మధ్య ఈ అధునాతన రైలు సర్వీసును అందుబాటలోకి తీసుకొచ్చింది. విశాలమైన గ్లాస్ విండోస్ లో నుంచి పర్యాటకులు అడవి అందాలను ఆస్వాదించేలాఈ సర్వీసును ప్రారంభించింది. ఈ రైలు ప్రయాణం ఏకంగా 107 కిలో మీటర్ల మేర కొనసాగుతుంది. మొత్తంగా నాలుగున్నర గంటల పాటు ఉంటుంది. టికెట్ ధరను రూ. 275గా నిర్ణయించింది.
ప్రకృతి అందాల నడుమ విస్టాడోమ్ ప్రయాణం
ఈ రైలు అందమైన పచ్చిక మైదానాలు, చిత్తడి నేలలు, భారీ అరణ్యాలు, అడవి జంతువులను ఆస్వాదించేలా కొనసాగుతుంది. దుధ్వా, పలియా కలాన్, మైలానీ సహా ఏకంగా 9 స్టేషన్లలో ఈ విస్టాడోమ్ రైలు హాల్టింగ్ తీసుకుంటుంది. బిచియా స్టేషన్ లో మొదలయ్యే ఈ జర్నీ.. మైలానీ స్టేషన్ దగ్గర ముగుస్తుంది. ఉదయం 11.45 లకు బిచియా ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం, సాయంత్రం 4.10 గంటలకు మైలానీకి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.05కు మైలానీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు.. రాత్రి 10.30కి బిచియాకు చేరుకుంటుంది. ప్రస్తుతం వీకెండ్స్ లో మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. విస్టాడోమ్ రైల్వే సర్వీసులకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రతి రోజు ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని రైల్వే జర్నీ ప్యాకేజీలను పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు యూపీ పర్యాటకశాఖ ప్రకటించింది.
Read Also: విశాఖ మెట్రో కీలక ముందడుగు.. పనులు ప్రారంభం ఎప్పటి నుంచి అంటే?
విస్టాడోమ్ రైలు ప్రయాణానికి మరింత ప్రచారం
తాజాగా తీసుకొచ్చిన విస్టాడోమ్ రైలు ప్రయాణానికి మరింత ప్రచారం కల్పించేందుకు యోగీ సర్కారు కీలక చర్యలు చేపడుతోంది. స్కూల్ విద్యార్థులు, సోషల్ మీడియా స్టార్స్ కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీలోని నేషనల్ పార్కులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ఏకో టూరిజం డిపార్ట్ మెంట్ మూడు నేషనల్ పార్కులలో ఈ విస్టాడోమ్ రైలు సర్వీసులను ప్రారంభించబోతోంది. ఈ మేరకు యోగీ సర్కారు మరికొన్ని విస్టాడోమ్ రైళ్లకు అర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: వందే భారత్ స్లీపర్ రైల్లో ఫ్రీ ఫుడ్? ఏయే వెరైటీలు పెడతారంటే?