Karnataka Honey Trap Case : తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఎవరో అని లిఫ్ట్ చేశామా… ఎదురుగా అందమైన అమ్మాయి. తమ మాటలతో రెచ్చగొడుతుంది, చేష్టలతో బుట్టలోకి దింపుతుంది. అంతే ఆ తర్వాత అంతా అంధకారమే.. అసభ్య, నగ్న వీడియోలను అడ్డుగా పెట్టుకుని అందినకాడికి వసూలు చేస్తుంటారు. నిత్యం బెదిరిస్తూ పబ్బం గడుపుకుంటారు. ఇలాంటి ఘటనలకు సామాన్యులే కాదు.. అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా బాధితులే అంటున్నారు కర్ణాటకకు చెందిన ఓ మంత్రి. తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో కూర్చున్న వారిలో తనకు తెలిసి 48 మందికి పైగా సభ్యులపై హనీట్రాప్ జరిగిందని.. అందులో చాలా బాధితులుగా ఉన్నారంటూ వెల్లడించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
ఇటీవల హనీ ట్రాప్ వలలో పడకుండా తప్పించుకున్న కర్ణాటక మంత్రి ఒకరు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మంత్రులు, నేతలే లక్ష్యంగా హనీ ట్రాప్ జరిగిందని వెల్లడించారు. ఈ వలపు వలకు జాతీయ స్థాయి నేతలు సహా 48 మంది చిక్కుకున్నారంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. అలాగే.. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలపైనా ఇలాంటి ఘటనలు జరిగాయని, వారిలో తనకు చాలా మంది తెలుసని తెలిపారు. రాజకీయ ఈ వ్యవహారం దుమారం రేపడంతో.. అధికార, విపక్ష పార్టీల నేతలు తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాంతో.. సభ్యుల డిమాండ్ మేరకు దర్యాప్తునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. గత 20 ఏళ్లలో తనను మాత్రమే కాకుండా 48 మంది ఎమ్మెల్యేలను కూడా ఈ విధంగా లక్ష్యంగా చేసుకున్నారని సదరు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా పేరుగాంచిన కెఎన్ రాజన్నను రెండుసార్లు లక్ష్యంగా చేసుకున్నారని పీడబ్ల్యూడీ (ప్రజా పనుల శాఖ) మంత్రి సతీష్ జార్కిహోళి వెల్లడించారు. బీజేపీ కూడా ఈ విషయంలో దర్యాప్తు కోరింది. దీంతో.. రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తుందని మంత్రి వెల్లడించారు.
కర్ణాటక శాసనసభలో మాట్లాడుతూ… రాజన్న మాట్లాడుతూ.. తుంకూరు నుంచి ఒక మంత్రి హనీ ట్రాప్ బాధితుడయ్యాడని ఒక చర్చ జరుగుతోంది. తుంకూరు నుంచి తాము ఇద్దరమే ఉన్నామని, ఒకరు తను కాగా, మరొకరు హోం మంత్రి అని తెలిపారు. ఇది కొత్త చర్య కాదని.. హనీ ట్రాప్ బాధితులుగా 48 మంది సభ్యులున్నారని అన్నారు. వారిలో చాలా మంది హైకోర్టు నుంచి స్టే కూడా తీసుకున్నారని అన్నారు. అధికార, విపక్షమనే వ్యత్యాసం లేకుండా.. రెండు వైపులా అలాంటి వాళ్లు ఉన్నారని అన్నారు. అందుకే.. హనీ ట్రాప్ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే.. తానే ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారం ఎక్కడ నుంచి జరుగుతుంది, దీని వెనుక ఏమైన కుట్ర ఉందా అనే విషయం తెలుసుకోవాలని అన్నారు. అనంతరం మాట్లాడిన రాష్ట్ర హో మంత్రి పరమేశ్వర్.. ఈ విషయంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందని ప్రకటించారు.
ఒక మంత్రిపై రెండు ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి విజయవంతం కాలేదని బీజేపీ మాజీ మంత్రి వి. సునీల్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీలో ఈ హనీట్రాప్ విషయాన్ని లేవనెత్తారు. దాంతో.. అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసిన ఈ వ్యవహారం.. ప్రత్యేక దర్యాప్తు దగ్గరకు దారితీసింది. అయితే.. కర్ణాటకలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని జార్కిహోళి అన్నారు. గత 20 ఏళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ వంటి ప్రతి పార్టీ బాధితులేనని అన్నారు. రాజకీయాల్లో అలాంటి వ్యూహాలు ఉండకూడదని ఆయన నొక్కి చెప్పారు. కొంతమంది ఇలాంటి పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు, దీనిని ఆపాలని అన్నారు.
ప్రస్తుత సంఘటన విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రితో మాట్లాడానని ఆయన అన్నారు. ఫిర్యాదు దాఖలు చేసి దర్యాప్తు జరపాలని మేము డిమాండ్ చేసాము… బాధితురాలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరినట్లు తెలిపారు. అప్పుడే దానిపై దర్యాప్తు జరుగుతుందని, నిజం బయటకు వస్తుందని అన్నారు. అయితే, మిస్టర్ జరిఖోలి ఒప్పుకోవడం బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది, కాంగ్రెస్ పార్టీ దీనిపై విమర్శలు గుప్పించి దర్యాప్తు డిమాండ్ చేసింది.