IIT Guwahati : అత్యంత కఠిన పరిస్థితులు, నిత్యం మారిపోయే వాతావరణ పరిస్థితుల మధ్య అంతర్జాతీయ సరిహద్దుల భద్రత నిర్వహించడం కత్తిమీద సాము. అందుకే.. ఇంటర్నేషనల్ బోర్డర్లో నిఘా విషయంలో భారత్ కీలక ముందడుగులు వేసింది. క్లిష్టమైన పరిస్థితులను అధిగమించేందుకు అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత సరిహద్దుల వద్ద అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత రోబో లతో నిఘా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఐఐటీ గుహవాటి పరిశోధకులు అధునాతన రోబోలను అభివృద్ధి చేశారు. ఈ విషయాన్ని వర్శిటీ అధికారులు, ఆర్మీ అధికారులు వెల్లడించారు.
ఐఐటీ గుహవాటి నేతృత్వంలో ప్రారంభమైన డీఏ స్పాటియో రోబోటిక్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ (DSRL) అనే స్టార్టప్… ఈ నిఘా రోబోట్ లను తయారు చేస్తుండగా.. వీటిని భారత సైన్యం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తోంది. సుదీర్ఘ సరిహద్దులను కలిగి ఉన్న భారత్.. నిత్యం వేల మంది సుశిక్షుతులైన సైన్యంతో సరిహద్దును కాపాడుకుంటోంది. కానీ.. మాారుతున్న పరిస్థితులు, నిత్యం సరికొత్త రీతుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేసే స్వయం ప్రతిపత్తితో పని చేసే రోబోటిక్ వ్యవస్థను, డోన్లు, స్టేషనరీ కెమెరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పరిశోధనలన్నీ దేశీయ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నిర్వహిస్తుండడం గమనార్హం. కాగా.. మ్యాన్యువల్ పద్ధతిలో నిర్వహించే పెట్రోలింగ్ లో పొరబాట్లకు అవకాశం ఉంటుంది. వివిధ పరిస్థితులు, కారణాలతో తప్పులు జరుగుతుంటాయి. కానీ.. ఏఐ ఆధారిత రోబోట్ లు నిర్వహించే భద్రతా చర్యల్లో అలాంటి తప్పులు జరగవని నిపుణులు చెబుతున్నారు.
సరిహద్దు రక్షణలో కీలకమైన మౌలిక సదుపాయాలు, వ్యూహత్మక రక్షణ అవసరాలకు రోబోటిక్ వ్యవస్థను వినియోగించడం అతిపెద్ద సాంకేతిక ముందడుగని ఆర్మీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఏఐ రోబోటిక్ వ్యవస్థతో ఎలాంటి లోపాలు, నిర్లక్ష్యానికి తావు లేకుండా.. ఎలాంటి ప్రతికూల, అనుకూల పరిస్థితుల్లోనైనా సరిహద్దును భద్రంగా ఉంచడంలో సమర్థవంతంగా పని చేయొచ్చని అంటున్నారు. జాతీయ భద్రత కు ముప్పుగా మారుతున్న.. అనేక భద్రతా సవాలను పరిష్కరించేందుకు ఇలాంటి అత్యాధునిక ఏఐ ఆధారిత పరిష్కారాలు భారత సైన్యానికి, భద్రతా సంస్థలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఐఐటి గుహవాటి పరిశోధకులు చెబుతున్నారు.
ఐఐటి గుహవాటి టెక్నాలజీ ఇన్ఫోవేషన్స్ సెంటర్ అధిపతి కేయూర్ సోరాథియా మాట్లాడుతూ.. స్వదేశీ, హైటెక్ పరిష్కారాలతో జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు ఈ ఆవిష్కరణ వ్యూహాత్మక పురోగతిని సూచిస్తుందని అన్నారు. బహుళ సెన్సార్లతో నిరంతరం నిఘా ఉంచే ఈ వ్యవస్థ.. ముందుగానే ముప్పులను గుర్తించడం, వాటిని సమర్థవంతంగా నిరోధించే విషయంలో చాలా సమర్థవంతంగా పని చేస్తుందని అంటున్నారు.
Also Read : Gold In Odisha : జాక్ పాట్ కొట్టిన స్టేట్ – లెక్కలేనంత బంగారం గనులు గుర్తింపు
ఈ వ్యవస్థను భారత్ సైన్యం క్షేత్రస్థాయిలో చురుగ్గా పరీక్షలు నిర్వహిస్తోంది. సున్నితమైన ప్రాంతాల్లో, సైనిక స్టేషన్ లో పెద్ద ఎత్తున ఈ నిఘా వ్యవస్థలను మొహరించేందుకు అనుకూలంగా ఉన్నాయా.? లేదా.? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద చొరబాట్ల నిరోధించడం, మాదకద్రవ్యాలు, మారణాయుధాలను సరిహద్దులు దాటించడం వంచి చర్యలను సమర్థవంతంగా అడ్డుకునే విషయంలో ఈ వ్యవస్థ పని తీరును అధికారులు పరిశీలిస్తున్నారు.