One Kidney Village Story: ఒక తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం చేసిన త్యాగం.. కానీ ఆ త్యాగం తాను ఊహించని రీతిలో ఆయన జీవితాన్నే ప్రపంచం నుండి వేరు చేసింది. ఒక్క నిర్ణయం.. దాన్ని తీసుకున్న కారణాలు తెలుసుకుంటే మనసు తట్టుకోలేదు. ఆ కథ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు వస్తోంది.. ఎందుకంటే ఇది ఓ మామూలు కథ కాదు.. ఒక భయానక వాస్తవం!
కిడ్నీ ఇచ్చేశాను.. కానీ మా పిల్లల భవిష్యత్తు చీకటిలో మిగిలింది అంటూ విలవిలలాడుతున్నాడు బంగ్లాదేశ్‌కు చెందిన 45 ఏళ్ల సఫీరుద్దీన్. తన గ్రామం బైగునిలోని ఇటుక గోడల మధ్య కూర్చుని, ఒంట్లో నొప్పిని మింగుకుంటూ జీవిస్తున్నాడు. వేసవికాలం 2024లో భారతదేశానికి వెళ్లి, రూ. 3.5 లక్షలకు కిడ్నీ అమ్మాడు. కారణం తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం కొత్త ఇల్లు కట్టాలని ఆశ. ఈ స్టోరీ విని మీ కంట కన్నీళ్లు వస్తున్నాయా? అయితే ఈ పూర్తి కథనం తప్పక చదవండి. అసలు సంగతి తెలుసుకోండి.
కిడ్నీ అమ్మిన డబ్బు ఎక్కడ? ఇల్లు అసంపూర్ణం, ఆరోగ్యం కనుమరుగైపోయింది!
చిన్న పిల్లలకు ఒక ఇంటి కల చూపించి, తన సొంత శరీరాన్ని తాకట్టు పెట్టాడు. కానీ ఆ డబ్బు పూర్తిగా ఖర్చయిపోయింది. ఇల్లు మాత్రం ఇప్పటికీ అడ్డకట్టలో నిలిచిపోయింది. ఎడమ వైపు నొప్పి మాత్రం ఎప్పుడూ వెంటాడుతోంది. రోజూ ఒక స్టోరేజ్ గోదాములో కూలీగా పనిచేస్తున్నాడు, కానీ శక్తి తక్కువ.. కేవలం బ్రతకడానికే ఈ శ్రమ.
బ్రోకర్ల మాటల మాయలో పడ్డ సఫీరుద్దీన్
బ్రోకర్లు వచ్చినప్పుడు ముందు నమ్మలేదు. కానీ వారే పాస్‌పోర్ట్, ఫ్లైట్ టికెట్, ఆసుపత్రి డాక్యుమెంట్లు అన్నీ చూసుకున్నారు. భారతదేశంలోకి వైద్య వీసాపై తీసుకెళ్లారు. అక్కడ తన అసలైన గుర్తింపు మార్చేశారు. తాను ఎవరికో బంధువు అని చూపిస్తూ నకిలీ డాక్యుమెంట్లు రెడీ చేశారని సఫీరుద్దీన్ అంటున్నారు. ఎవరి కోసం కిడ్నీ ఇచ్చానో ఇప్పటికీ తెలియదని, కానీ ఎవరు తీసుకున్నారో చెప్పలేదు అంటున్నాడు సఫీ.
ఇదొక్కటే కాదు.. ఈ గ్రామాన్ని కిడ్నీ ఊరు అనేస్తున్నారు!
బైగుని అనే చిన్న గ్రామంలో 6,000 మందికి మించని జనాభా ఉంది. కానీ ఈ ఊరిలో దాదాపు ప్రతి వీధిలోనూ ఒక కిడ్నీ మిగిలిన వ్యక్తిని చూస్తారు. 2023లో వచ్చిన ఓ అధ్యయనం ప్రకారం, ఈ ప్రాంతంలో ప్రతి 35 మందిలో ఒకరు కిడ్నీ అమ్మారు. కారణం పేదరికం, అప్పులు, మోసాలు ఇవేనని గ్రామస్తులు అంటున్నారు.
కిడ్నీ అమ్మి ఎగబడ్డ జోస్నా బేగం
జోస్నా బేగం అనే మహిళ కథ మరో కోణం చూపిస్తుంది. ఆమె భర్త చనిపోయాక ఇద్దరు కూతుర్లను పోషించడానికి ధాకాకు వెళ్లి గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసింది. తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ భర్తతో కలిసి ఆమెను కూడా బ్రోకర్లు మాయ చేశారు. తొలుత రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. తర్వాత రూ. 7 లక్షలకు పెంచారు. కానీ చివరికి ఇచ్చింది కేవలం రూ. 3 లక్షలే. ఆ తర్వాత ఆమెను విడిచి వదిలేసి భర్త కూడా మరో పెళ్లి చేసుకున్నాడు.
కిడ్నీ ఇచ్చినవాడు.. బ్రోకర్‌గా మారిన సజల్
ఒకప్పుడు బిజినెస్ చేసేవాడు సజల్. ఒక ఆన్‌లైన్ కంపెనీ మోసంతో అప్పుల బారిన పడ్డాడు. తరువాత కిడ్నీ అమ్మేశాడు. కానీ ఇచ్చే డబ్బు తక్కువ కావడంతో.. బ్రోకర్ల బృందంలోకి అతనే చేరిపోయాడు. మన దేశ ఆసుపత్రుల్లో మరొకరికి కిడ్నీలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశాడు. చివరికి బ్రోకర్లతో గొడవపడడంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఓ క్యాబ్ డ్రైవర్‌గా బ్రతుకుతున్నాడు. కానీ అతని మనసు మాత్రం ఖాళీ. ఎవ్వడూ ఇష్టపడి కిడ్నీ ఇవ్వడు.. నెత్తిన పేదరికముంటే తప్పని అంటున్నాడు అతడు.
Also Read: Band baja school entry: బ్యాండ్ బాజాతో స్కూల్ ఎంట్రీ! అబ్బా.. తండ్రి అంటే ఇతనే భాయ్!
డబ్బున్నవాడికి బతుకుతుంది.. పేదోడికి మిగిలేది మోసమే!
కిడ్నీ కొనేవాళ్లు భారతదేశం లేదా బంగ్లాదేశ్ నుంచి డబ్బున్నవాళ్లు. వాళ్లు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేస్తారు. కానీ దాతకి వస్తుంది కేవలం రూ. 2.5 లక్షలు లేదా రూ. 4 లక్షలు. మిగతా మొత్తం డాక్టర్లు, బ్రోకర్లు, నకిలీ డాక్యుమెంట్ తయారుచేసే వారు పంచుకుంటారని గ్రామస్తులు అంటున్నారు.
చట్టాలున్నా.. కాగితాల మాయతో వాడేసే బ్రోకర్లు
భారతదేశంలో కిడ్నీ మార్పిడి చట్టం ప్రకారం, రక్తసంబంధం ఉన్న బంధువులు మాత్రమే కిడ్నీ ఇవ్వగలరు. కానీ బ్రోకర్లు నకిలీ ఐడీ, డీఎన్ఏ టెస్టులు కూడా రెడీ చేసి హాస్పిటల్‌కు చూపించి అనుమతి తీసేస్తున్నారు. అవే నకిలీ పత్రాలతో వేలాది అక్రమ మార్పిడులు జరుగుతున్నాయి.
వాస్తవం ఇదేనా?
ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు. ఇది సమాజం మీద ముద్ర వేస్తున్న ముసురుతున్న మాయ. ఆరోగ్య రంగంలో ఉన్న లోపాలు, పేదరికం, డబ్బున్నవాళ్ల అసహనం కలిసి ఒక పక్కన మనుషుల అవయవాలు అమ్ముడవుతున్నాయి. పాశవికంగా మనసులూ, శరీరాలూ నష్టపోతున్నాయి. జీవితాలు బుగ్గి పాలవుతున్నాయి. అందుకు ఉదాహరణే ఇది. మొత్తం మీద ఇలాంటి వాటికి పాల్పడే మోసగాళ్లను గుర్తించి చట్టరీత్యా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.