
INDIA alliance meeting live updates(Politics news today India) :
ఇండియా కూటమి ఎన్నికలకు రెడీ అవుతోంది. అది జమిలీ ఎన్నికలైనా సరే తగ్గేదేలే అంటోంది. ముంబైలో జరుగుతున్న కూటమి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో తయారు.. సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చించారు.
13 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఇండియా కూటమి. వీరంతా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును సమన్వయం చేయనున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ 30కల్లా పోటీ చేయాల్సిన సీట్లను పార్టీల మధ్య సర్దుబాటు చేస్తారు.
‘ఇండియా’ తరఫున ప్రధానమైన ప్రజాసమస్యలపై దేశవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను త్వరగా ఖరారు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. జూడేగా భారత్- జీతేగా ఇండియా.. నినాదంతో కూటమి ప్రజల్లోకి వెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీలో పార్టీకి ఒక్కరు చొప్పున పలువురు సీనియర్లను నియమించారు. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ తరఫున శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ తరఫున అభిషేక్ బెనర్జీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ లీడర్ రాఘవ్ చద్దా, సమాజ్‌వాదీ నుంచి జావేద్ అలీఖాన్, జేడీయూ తరఫున లలన్ సింగ్, సీపీఐ నేత డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీలతో కీలక కమిటీని ఏర్పాటు చేసింది ఇండియా.
ఇండియా కూటమిని ఓడించడం బీజేపీ తరం కాదన్నారు రాహుల్‌గాంధీ. చైనా ఆక్రమణపై మోదీ మౌనం అవమానకరమని.. అదానీ గ్రూపుపై ఆరోపణలు వస్తుంటే ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడంపై విపక్ష కూటమి నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. నిరంకుశ ప్రభుత్వ నిష్క్రమణకు కౌంట్‌డౌన్ మొదలైందని.. INDIA కూటమి బలం, విపక్షాల ఐకమత్యం చూసి సర్కారు భయపడుతోందని అన్నారు.
పలువురు ప్రతిపక్ష నేతలు సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రక్రియ దేశంలో సమాఖ్య స్ఫూర్తికి ముప్పు కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. గ్యాస్‌పై రూ.200 తగ్గించడం, ఆ వెంటనే రాజ్యాంగ సవరణకు ప్రయత్నాలు ప్రారంభించడం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదనే విషయాన్ని ఆ పార్టీ గుర్తించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నికలను వాయిదా వేసే కుట్ర జరుగుతోందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.