2025లో 146 కోట్ల జనాభాకు భారత్
వచ్చే రోజుల్లో ఎక్కువ పిల్లలున్న వారికే లబ్ధిఐక్యరాజ్య సమితి చెబుతున్న మాట ఏంటంటే.. భారత్ 2025లో 146 కోట్ల జనాభాకు చేరుకుంటుంది. ప్రపంచంలోనే ఇదే అత్యధిక జనాభా గల దేశం కాదనడం లేదు. కానీ సంతానోత్పత్తి రేటు మాత్రం తగ్గుతూ వస్తోంది. ఇదే ఆందోళనకరంగా చెబుతోంది.. UN జనాభా నివేదిక.
ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ నుంచి బయట పడాలి
UNFPA వారి 2025- స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదిక.. ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ నుంచి భారత్ బయట పడాలని సూచిస్తోంది. ఇప్పటికీ లక్షలాది మంది ప్రజలు తమ నిజమైన సంతానోత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతున్నారని అంటోందీ నివేదిక.
ఒక దేశ సంతానోత్పత్తి ఎంత గొప్పగా ఉంది.. ఇదే కీలకం
ఒక దేశంలో ఎక్కువ జనాభా ఉన్నారా తక్కువ జనాభా ఉన్నారా? అన్నది ముఖ్యం కాదు.. సంతానోత్పత్తి ఎంత గొప్పగా ఉంది? ఇదే కీలకం. ఇదే అత్యంత ఆందోళన కలిగించే వ్యవహారం. ఎందుకంటే భారత్ లో జనాభా భారీ ఎత్తున ఉండటం వేరు. వారిలో ఎంత మంది సంతానోత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నది వేరు.
ప్రస్తుత పరిస్థితులకు కారణం మెరుగైన వైద్య సేవలు
ప్రస్తుత పరిస్థితులకు కారణం మెరుగైన వైద్య సేవలు. గర్భనిరోధక మందులు. ఆపై వందకు నూట యాభై శాతం వ్యక్తిగత స్వేచ్ఛ. పెరిగిన జీవన శైలి వెరసీ.. ప్రస్తుత భారత సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తోందని.. ఇది కరెక్టు కాదని తేల్చింది ఐక్యరాజ్య సమితి. చాలా మంది యువ భారతీయ మహిళలు.. అందం కరిగిపోతుందనో, లేక తమ సుఖ సంతోషాలకు అడ్డు వస్తారనో పిల్లల్ని కనడం తగ్గిస్తున్నారు. దీంతో ఏం జరుగుతోందంటే.. భారతీయ సంతానోత్పత్తి శాతం క్రమేణా బలహీన పడుతోందని హెచ్చరిస్తోంది ఐక్యరాజ్య సమితి జనాభా నివేదిక.
2. 1గా ఉండాల్సిన సగటు 1. 9 గా ఉంది- UN
భారత దేశ సంతానోత్పత్తి రేటు ఒక స్త్రీ సగటున రెండుకన్నా ఎక్కువగా ఉండాల్సింది తక్కువగా ఉంది. ప్రస్తుతం మన దేశ సంతానోత్పత్తి 1. 9 గా ఉంది. అది 2. 1 గా ఉండాలని సూచిస్తోంది ఐక్యరాజ్య సమితి. మాములుగా ఒక తరం నుంచి మరో తరం ఒక విషయంలో పెరుగుదల కనిపిస్తుంది. కానీ జనాభా విషయంలో మాత్రమే.. ఒక తరం నుంచి మరొక తరం తగ్గుతూ రావడం ఆందోళనకరంగా వర్ణిస్తోందీ సంస్థ.
10-19 వయసు- 17 శాతం
జనన రేటు బాగా తగ్గినా.. భారత యువ జనాభా శాతం ప్రస్తుతానికైతే బలంగానే ఉంది. 0-14 సంవత్సరాల వయస్సులో 24 శాతం, 10-19 సంవత్సరాలలో 17 శాతం, 10-24 సంవత్సరాలలో 26 శాతంగా ఉండటం మంచి విషయమేనని కితాబునిచ్చిందీ నివేదిక. ప్రస్తుతానికి దేశంలో 68 శాతం జనాభా పనిచేయడానికి వీలైన వయసు గలిగిన వారున్నారు. 15 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు గలవారు తగినంత మంది ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏదీ లేదు. ఈ శాతం బాగా సరిపోతుంది. కానీ తమ ఆందోళనంతా భవిష్యత్ తరాల గురించేనంటోందీ రిపోర్ట్.
65 ఏళ్ల వయసు- 7 శాతం
ప్రస్తుతం భారత్ లో 65 ఏళ్ల వయసు గల వారు 7 శాతంగా ఉన్నారు. ఆయుర్ధాయం బాగా పెరగటంతో వీరి జనాభా ఫ్యూచర్లో బాగా పెరిగే ఛాన్సుంది. 2025 నాటికి పురుషుల ఆయుర్ధాయం 71, మహిళల సగటు జీవన కాలం 74 ఏళ్లకు పెరగనుందని అంచనా.
40 ఏళ్ల తర్వాత భారత జనాభా 1. 7 మిలియన్లకు పెరుగుదల
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, ప్రస్తుతం భారతదేశ జనాభా సుమారు 1.5 బిలియన్ల మంది. 40 ఏళ్ల తర్వాత ఈ సంఖ్య సుమారు 1.7 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది ఐక్యరాజ్య సమితి జనాభా నివేదిక. ఆ తర్వాత నుంచి తగ్గుదల నమోదవుతుందని చెబుతోందీ నివేదిక.
1960కాలంలో సగటున ఒక స్త్రీకి ఆరుగురు పిల్లలు
1960లో భారత జనాభా కేవలం 43 కోట్ల మంది మాత్రమే ఉన్నపుడు.. సగటున ఒక స్త్రీకి ఆరుగురు పిల్లలుండేవారు. అప్పట్లో తమ శారీరక సౌందర్యం, జీవన ప్రమాణం, ఆయుర్ధాయం వంటి విషయాల్లో తక్కువ నియంత్రణ కలిగి ఉండేవారు. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మను పొందినట్టే అన్న భావన ఉండేది. ఇద్దరిలో ఒకరు మాత్రమే విద్యనభ్యసించేవారు. అదే ఇప్పుడు పెరిగిన చదువులు, ఆపై వైద్య సదుపాయాలను అనుసరించి చెబితే.. మాతా శిశుమరణాలు బాగా తగ్గాయి. కానీ ప్రపంచ బ్యాంకు డాటా ప్రకారం.. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు గర్భ నిరోధక పద్ధతులు వాడటం మొదలు పెట్టారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ రావడంతో సంతానోత్పత్తి కూడా తగ్గుదల నమోదు చేస్తూ వస్తోందని అంచనా వేస్తున్నారు.
విద్య, వైద్య సదుపాయం లేనపుడు ఆరుగురు
మాములుగా ఒక విషయంలో భయం కలిగినపుడు దానికి సంబంధించిన ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది. విచిత్రమైన విషయమేంటంటే ఒక్క సంతానోత్పత్తి విషయంలో మాత్రం ఇది రివర్స్ అవుతోంది. ఏ విద్య, వైద్య సదుపాయం లేని రోజల్లో ఆరు మంది సగటున సంతానోత్పత్తి చేసిన మహిళ.. నేడు అన్ని వసతులు సదుపాయాలు పెరిగిన పరిస్థితుల్లో ఈ సంఖ్యను ఇద్దరికి పరిమితం చేశారు.
నేటి మహిళకు తన తల్లికన్నా ఎక్కువ హక్కులు
నేటి మహిళకు తన తల్లికన్నా ఎక్కువ హక్కులు స్వేచ్ఛా స్వాతంత్రాలున్నాయి. అయితే వారు తమకున్న హక్కులు సదుపాయాల ద్వారా.. ఎక్కువ మంది పిల్లల్నేమీ కోరుకోవడం లేదు. ఇద్దరే ఎక్కువగా భావిస్తున్నారు. కొందరైతే తమకున్న పని భారం, ఖర్చు భారాలను అనుసరించి ఒక్కరితో సరిపెట్టేస్తున్నారు. దీంతో క్రమేణా భారత సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గుముఖం పడుతూ వస్తోందని అంటున్నారు.
వచ్చే రోజుల్లో ఎక్కువ పిల్లలున్న వారికే లబ్ధి
ఐక్యరాజ్య సమితి నివేదిక భారత దేశాన్ని మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉంచింది. జనాభా రెట్టింపు సమయాన్ని 79 సంవత్సరాలుగా అంచనా వేసింది. తమకు అర్ధం కాని విషయమేంటంటే.. ప్రసూతి మరణాలలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. మిలియన్ల కొద్దీ తల్లీ పిల్లలు ఈ ప్రమాదం నుంచి గట్టెక్కుతున్నారు. తమ పిల్లల్ని ఎంతో గొప్పగా చూసుకుంటున్నారు. అయినా సరే రకరకాల ఆదాయాలు, కులాలు ఇతర సముదాయాల్లో అసమానతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిథులు.