London Student Death: లండన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ భారతీయ యువతి.. ఎవరికీ చెప్పకుండా స్వదేశానికి వచ్చి ఆపై శవమై తేలిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. కొద్ది నెలల క్రితమే ఇండియాకు వచ్చిన సదరు యువతి.. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచింది. చివరకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ట్రాన్సాక్షన్ల ద్వారా ఆమె ఇండియాలోనే ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్లేసరికి పూణేలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆ యువతి శవమై కనిపించింది.
ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్)కు చెందిన ముగ్ధ దేశ్‌ముఖ్ (34) అనే మహిళ గత ఏడాది జూలైలో ఎంబీఏ (MBA) చదవడం కోసం లండన్ వెళ్లింది. అక్కడ ఒంటరిగా నివసిస్తూ చదువుతో పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులతో ఆమె క్రమం తప్పకుండా ఫోన్ కాల్స్, మెసేజ్ ద్వారా టచ్‌లో ఉండేది.
గత నెల అక్టోబర్ 24 నుంచి ముగ్ధ సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అని రావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు, లండన్‌లో ఉన్న ఆమె స్నేహితురాలిని సంప్రదించారు. అక్టోబర్ 22న ముగ్ధతో చివరిసారిగా మాట్లాడినట్లు చెప్పిన ఆ స్నేహితురాలు.. వెంటనే లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విచారణ జరిపిన లండన్ పోలీసులు.. ముగ్ధ ఆగస్టు చివరి వారంలోనే యూకే విడిచి వెళ్లిపోయినట్లు స్పష్టంచేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఖంగు తిన్నారు.
ముగ్ద కుటుంబ సభ్యులు భారత విదేశాంగ శాఖ, ఇండియన్ హైకమిషన్‌ను ఆశ్రయించి ఆమెను వెతకాలని కోరారు. ఈ క్రమంలో ముగ్ధ తండ్రి ఆమె బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్లను నిశితంగా పరిశీలించగా ఒక ఊహించని విషయం బయటపడింది. అక్టోబర్ 8 నుంచి 25 మధ్య ఆమె ఖాతా నుంచి పలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అందులో కొన్ని ఆర్డర్లు ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతం చిరునామాతో జరగడంతో ముగ్ధ ఇండియాలోనే ఉందనే విషయం కుటుంబానికి స్పష్టమైంది.
ఈ సమాచారంతో రంగంలోకి దిగిన ఛత్రపతి శంభాజీనగర్ పోలీసులు.. ముగ్ధ లొకేషన్‌ను పూణే సమీపంలోని గహుంజే వద్ద ఉన్న ‘లోధా బెల్మోండో’ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌గా ట్రాక్ చేశారు. పింప్రి చించ్వాడ్ పరిధిలోని షిర్గావ్ పోలీసుల సాయంతో ఆ ఫ్లాట్‌కు చేరుకున్నారు. డోర్ లాక్ చేసి ఉండటంతో కీ-మేకర్ సాయంతో తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా.. ముగ్ధ మృతదేహం కనిపించింది.
Also Read: ధరల అస్త్రంతో జగన్ అటాక్.. పాత లెక్కలతో టీడీపీ కౌంటర్.. నెట్టింట రచ్చ రచ్చ!
అయితే ముగ్ద శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆ ఫ్లాట్‌ను ముగ్ద అద్దెకు తీసుకున్నప్పటికీ ఆగస్టు నుంచి అక్కడ నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలిందని ఇన్ స్పెక్టర్ దేవేంద్ర చవాన్ స్పష్టం చేశారు. ఆమె లండన్ నుంచి ఎందుకు రహస్యంగా వచ్చింది? ఎవరికీ చెప్పకుండా పూణేలో ఎందుకు ఉంటోంది? ఆమెది హత్య లేక ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసులు ప్రస్తుతం సమగ్ర విచారణ జరుపుతున్నారు.
Also Read: ‘గెలిచే దమ్ములేక.. ఈసీపై నిందలా?’.. రాహుల్, అఖిలేష్‌లకు అమిత్ షా ఓపెన్ ఛాలెంజ్!