IndiGo Flight Fire:ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా మంటలు కనిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.విమానం గాల్లో ఉండగానే ఈ ఘటన జరగడం గమనార్హం.అయితే ప్రయాణికులు ఆందోళన చెందుతున్న సమయంలో విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలోని వారందరూ సురక్షితంగా ఉన్నారని ఇండిగో సంస్థ వెల్లడించడంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు, ఇతరులు ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ నుంచి చెన్నైకు వెళ్తుండగా
అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇండిగోకు చెందిన 6E6115 విమానం ఢిల్లీ నుంచి చెన్నైకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి చెందిన పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగినట్లు సమాచారం. సాధారణంగా మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉపయోగించే పవర్ బ్యాంక్ వల్ల విమానంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం కలకలం రేపింది. విమానం ప్రయాణం కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో సిబ్బంది వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
లగేజీ కంపార్ట్‌మెంట్ వద్ద మంటలు
విమానంలో ప్రయాణికులు తమ బ్యాగులను ఉంచుకునే పైభాగంలోని లగేజీ కంపార్ట్‌మెంట్ వద్ద మంటలు కనిపించినట్లు సమాచారం. దీంతో అక్కడున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో మంటలు చెలరేగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు కూడా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు విమాన సిబ్బంది వేగంగా స్పందించి అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పరిస్థితి మరింత తీవ్రం కాకుండా అడ్డుకోగలిగారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో
అయితే, విమానంలో మంటలు చెలరేగిన విషయం గుర్తించిన తర్వాత విమానాన్ని హైదరాబాద్ వైపు మళ్లించినట్లు సమాచారం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దించేందుకు ఏర్పాట్లు చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ఊరట చెందారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని సంస్థ వెల్లడించినట్లు సమాచారం.
మంటలు చెలరేగడానికి గల కారణం
ప్రస్తుతం ఇండిగో విమానంలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంటలు చెలరేగడానికి గల కారణం, పవర్ బ్యాంక్ పరిస్థితి, విమానంలో తీసుకున్న భద్రతా చర్యలపై అధికారికంగా మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తానికి, విమానం గాల్లో ఉండగానే మంటలు కనిపించడం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసినా, సిబ్బంది తక్షణమే స్పందించడం, విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి.