High Alert in Delhi: 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. వికసిత్ భారత్ థీమ్ తో వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ రేపు 11వ సారి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎర్రకోటపై ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో ఎర్రకోట వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, పార్లమెంట్, ఇండియా గేట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఐజీఐ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మాల్స్ వద్ద కూడా కేంద్ర బలగాలు మోహరించాయి. ఇక ఎర్రకోట పరిసరప్రాంతాల్లో 700 ఏఐ సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు. ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 20 వేల నుంచి 22 వేల మంది ప్రజలు హాజరవుతారన్న సమాచారం ఉంది. వేడుకలకు హాజరయ్యేవారందరికీ క్యూఆర్ స్కానింగ్ కోడ్ పాసుల్ని జారీ చేశారు. ఈ వేడుకల్లో ఈ ఏడాది ఒలింపిక్స్ లో పతకాలు అందుకున్నవారు ఆకర్షణగా నిలవనున్నారు.
Also Read: అక్కడ జాతీయ జెండా ఆవిష్కరించేది సీఎం కాదు.. మంత్రే!
కాగా.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఢిల్లీ పోలీసుల్ని హెచ్చరించాయి. ఇద్దరు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినట్లు ఐబీ వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
అయితే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనే ఆత్మాహుతి దాడి జరగవచ్చని స్పష్టంగా చెప్పలేమని పేర్కొంది ఐబీ. రెండ్రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ఉగ్రవాదుల సంభాషణలు నిఘా వర్గాలు వినడంతో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. పాక్ నిఘా సంస్థ అయిన ఐఎస్ఐ పంజాబ్ లో ఉన్న గ్యాంగ్ స్టర్లు, అతివాదులు, ఉగ్రవాదులతో అక్కడ జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, అమర్ నాథ్ యాత్రకు ఆటంకం కలిగించేలా వ్యూహం రచిస్తున్నట్లు ఐబీ వర్గాలు తెలిపాయి. ఐబీ హెచ్చరికలతో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. మూడు, 4 రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే కంట్రోల్ రూమ్ కు సమాచారమివ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.