Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై అక్కడి పాలనా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం కలిగి ఉండి, ఉగ్ర సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగించారు. విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, రహస్యంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రియాసి జిల్లాకు చెందిన జి. హుస్సేన్, రాజౌరీ జిల్లాకు చెందిన మజిద్ ఇక్బాల్ దార్‌లను విధుల నుండి తొలగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎల్‌ఈటీ టెర్రరిస్టులతో ఉపాధ్యాయుడికి సంబంధాలు
ప్రభుత్వ అధికారి ప్రకటన ప్రకారం.. నిందితులలో ఒకడైన జి. హుస్సేన్ రియాసి జిల్లాలోని తహసీల్ మహోర్, కల్వా ములాస్ నివాసి. ఇతను ప్రభుత్వ విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే, ఇతను పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రవాదులతో నిరంతరాయంగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి. పాకిస్తాన్‌లో ఉన్న ఎల్‌ఈటీ ఉగ్రవాద నాయకుల ఆదేశాల మేరకు, హుస్సేన్ ‘టెర్రర్ ఫండ్స్’ సేకరించినట్లు ప్రతినిధి తెలిపారు. ఆ సేకరించిన డబ్బును, తెలిసిన ఉగ్రవాదుల కుటుంబాలకు చేరవేసేవాడు. ఇది కాకుండా, సరిహద్దు నుండి పంపబడిన అనుమానాస్పద పార్శిళ్లను ఉగ్రవాద కుటుంబాలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
Read Also: Children Kidnap: ముంబైలో 20 మంది పిల్లల కిడ్నాప్ కలకలం.. చంపేస్తానని బెదిరింపులు..
ఐఈడీ అమర్చిన మరో ఉపాధ్యాయుడు
ఇక రెండవ నిందితుడు, మజిద్ ఇక్బాల్ దార్ కూడా విద్యాశాఖలో ఉపాధ్యాయుడే. ఇతను రాజౌరీ జిల్లాలోని ఖియోరా, వార్డ్ నెం. 1 (జే&కే బ్యాంక్ సమీపంలో) నివాసి. ఇతను ఎల్‌ఈటీ ఉగ్రవాద సంస్థకు నమ్మకమైన సహచరుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన ఒక ఎల్‌ఈటీ టెర్రరిస్ట్ హ్యాండ్లర్ ఆదేశాల మేరకు ఇతను పనిచేస్తాడు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద లీడర్ల నుంచి ప్రతిఫలంగా నార్కోటిక్స్, మరిన్ని ఉగ్ర నిధులను బహుమతిగా పొందాలనే దురుద్దేశంతోనే ఇతను ఈ కుట్రకు పాల్పడినట్లు ప్రతినిధి తన ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలోనూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఇదే తరహాలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కుప్వారా జిల్లాలోని కర్నాలో పోస్ట్ చేయబడిన ఉపాధ్యాయుడు ఖుర్షీద్ అహ్మద్ రాథర్, అదే జిల్లాలోని కేరన్ ప్రాంతంలో పోస్ట్ చేయబడిన గొర్రెల పెంపకం విభాగంలో స్టాక్ అసిస్టెంట్ సియాద్ అహ్మద్ ఖాన్‌గా గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుండడం స్థానికుల్లో అందోళన కలిగిస్తోంది.