IOC Manager: మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా పెట్రోల్ బంక్‌ను సీజ్ చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సేల్స్ మేనేజర్ మహేష్ షెల్కే దారుణ హత్యకు గురయ్యారు. పెట్రోల్ బంక్ నిర్వాహకుడి కుమారుడు కత్తితో ఏడుసార్లు విచక్షణారహితంగా దాడి చేయడంతో షెల్కే అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. హింగోలీ పరిధిలోని చోంధీ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ గత 3 నెలలుగా మూతపడి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆ బంక్‌ను సీల్ చేసి స్వాధీనం చేసుకునేందుకు సేల్స్ మేనేజర్ మహేష్ షెల్కే తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే బంక్‌ను పునఃప్రారంభించేందుకు తమకు మరో నెల రోజుల గడువు కావాలని బంక్ నిర్వాహకుడు సాహెబ్‌రావ్ పాండవ్‌వీర్ అధికారులను కోరారు. ఇందుకు అధికారులు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మాటమాట పెరగడంతో సహనం కోల్పోయిన నిర్వాహకుడి కుమారుడు ఉమేష్ పాండవ్‌వీర్.. తన వద్ద ఉన్న కత్తితో మహేష్ షెల్కేపై దాడి చేశాడు. పొత్తికడుపు, వీపు, ముఖ భాగాలపై తీవ్రంగా ఏడుసార్లు పొడవడంతో షెల్కే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. దాడి అనంతరం నిందితుడు తన అనుచరులతో కలిసి రెండు కార్లలో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై ఇండియన్ ఆయిల్ చైర్మన్ అరవిందర్ సింగ్ సాహ్నే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితుడి కుటుంబానికి సంస్థ అండగా ఉంటుందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా మహారాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు.
Also Read: ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!
మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. దేశసేవలో నిరంతరం శ్రమిస్తున్న ఇంధన రంగ సిబ్బంది భద్రత, రక్షణ తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ప్రైవేట్ వీడియో లీక్… బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య భయంకరమైన బ్లాక్‌మెయిల్ గేమ్