Raja Singh: దేశంలో జనాభా నియంత్రణ కోసం హమ్ దో, హమారే దో(ఇద్దరు పిల్లల విధానం) చట్టాన్ని తీసుకురాకపోతే, ఆత్మరక్షణ కోసం ప్రతి హిందూ కుటుంబం తమ ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకీ ఉంచుకోవాల్సిన అవసరం ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిలో తుపాకీ ఉంచుకుని, తన అనుచరులతో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ, రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో దేశంలో ముస్లింల జనాభా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఒక ప్రముఖ పత్రికలో కథనం వచ్చినట్లు ప్రస్తావించారు. జనాభా నిష్పత్తిలో ఇటువంటి మార్పులు జరిగితే భవిష్యత్తులో హిందువుల ఆస్తులకు, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పొరుగు దేశం పాకిస్థాన్‌లో మైనారిటీ హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల వంటి పరిస్థితులు ఇక్కడా తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దేశంలోని హిందువుల ఆశీస్సులతో మోడీ ప్రధానిగా కొనసాగుతున్నారని, మోడీ ఉంటేనే ఏదైనా సాధ్యమనే నమ్మకం తమకుందని రాజాసింగ్ అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉండగానే జనాభా నియంత్రణ చట్టం అమల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఒకవేళ ఆ చట్టం రాకపోతే, హిందువులు తమ రక్షణ కోసం చట్టబద్ధమైన ఆయుధాలను కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని గన్ కల్చర్ ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. యూపీలో దాదాపు ప్రతి ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండే సంస్కృతి తనకు ఎంతో నచ్చిందని, దేశవ్యాప్తంగా హిందూ కుటుంబాల్లోనూ ఇదే విధానం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: రూ.40 కోట్లతో అదరగొట్టిన ధనుష్.. కానీ అసలు పరీక్ష ఇప్పుడే!
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏ క్షణమైనా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తథ్యమని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన కుమారుడు సాయికిరణ్ యాదవ్ బీజేపీలో చేరుతున్నారని, ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా సాయికిరణ్ పోటీ చేస్తారని మీడియాలో వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. అవన్నీ పూర్తిగా ఫేక్ వార్తలని, బీజేపీలో ఎంతోమంది సమర్థులైన నాయకులు ఉన్నారన్నారు. తమ పార్టీలో ఇంతమంది నాయకులు ఉండగా ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ సైతం తలసాని కుమారుడిని బరిలోకి దింపాలా లేక మరెవరికైనా అవకాశం ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్ అనర్హత వేటుతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైందని ఆయన గుర్తుచేశారు. గత ఎన్నికల్లో నాగేందర్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, కానీ ఆయన చేసిన తప్పుల వల్ల మళ్లీ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. దీంతో ఖైరతాబాద్ ఓటర్లందరూ ఈసారి వంద శాతం బీజేపీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు, మూడు మేయర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ గెలుపు నగరంలో ఒక సానుకూల రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తుందని, అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ సీటును దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు.
Also Read: స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ జగన్ సంచలన పోస్ట్.. వీడియోలు విడుదల!