Rajasthan Railway Blast: స్వేచ్ఛ బ్యూరో: సంచలనం సృష్టించిన రాజస్థాన్ రాష్ట్రం శ్రీగంగానగర్ జిల్లాలో జరిగిన రైల్వే ట్రాక్ పేలుడు ఘటన వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో ముమ్మరంగా దర్యాప్తు జరిపిన అధికారులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు పిస్టళ్లు, బుల్లెట్లతోపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
పంజాబ్ పోలీసులు సంయుక్తంగా విచారణ
శ్రీగంగానగర్ జిల్లాలోని 50 జీబీ పాయింట్ సమీపంలో (రాంసింగ్ పూర్-అనూప్ ఘఢ్ రైల్వే మార్గంలో) ఈనెల 4న రాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పేలుడు ధాటికి ట్రాక్ కింద ఉన్న కాంక్రీట్ పిల్లర్లు దెబ్బతిని రెండు అడుగుల లోతు గుంత ఏర్పడింది. ప్యాసింజర్ రైలు వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో రాజస్థాన్ ఏటీఎస్, రాజస్థాన్ పోలీసులు, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా విచారణ జరిపారు.
డ్రోన్లతో పేలుడు పదార్థాలు..
రాజస్థాన్ ఏటీఎస్, రాజస్థాన్ పోలీసులు, పంజాబ్ పోలీసులు ఆపరేషన్ జరిపి పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో మహక్ దీప్ కౌర్ (21), దేవిందర్ సింగ్ 22)లను అరెస్ట్ చేశారు. వీరిని జరిపిన విచారణలో రైల్వే ట్రాక్ పై ఐఈడీ అమర్చి ప్రయాణికుల రైలును పేల్చివేయాలని ఐఎస్ఐకి చెందిన హ్యాండ్లర్ షా ఆదేశాల మేరకు నిందితులు కుట్ర పన్నినట్టు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి రెండు పిస్టళ్లు, 46 తూటాలు, 30వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడుకు సంబంధించిన పేలుడు పదార్థాలు సరిహద్దు ద్వారా డ్రోన్ల సాయంతో వచ్చినట్టు అనుమానిస్తున్నారు. పేలుడుకు సహకరించిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని భద్రతా బలగాలు విచారిస్తున్నాయి.
Also Read: కవితకు రేవంత్ స్క్రిప్ట్ అక్కర్లేదు.. మీ బాగోతాలన్నీ ఆమెకు తెలుసు: ఆది శ్రీనివాస్